IRCTC: రైళ్లలో ఫుడ్ ఆర్డర్ సులువు.. ఐఆర్‌సీటీసీ ఇ-ప్యాంట్రీ సేవల ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా భారతీయ రైల్వే మరో కీలక అడుగు వేసింది. రైలు ప్రయాణంలో ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ఇ-ప్యాంట్రీ (E-Pantry) సేవలను ప్రారంభించింది. తొలుత వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ప్రస్తుతం 25 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సేవలను విస్తరించింది. ప్యాంట్రీ కారు ఉన్న ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. కన్ఫర్మ్ టికెట్, ఆర్‌ఏసీ లేదా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులు కూడా ఇ-ప్యాంట్రీ ద్వారా ముందుగానే భోజనం ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్డర్ చేసిన ఆహారాన్ని ప్యాంట్రీ కార్ సిబ్బంది నేరుగా ప్రయాణికుల సీటు వద్దకే డెలివరీ చేస్తారు.
Details
డెలివరీ సమయంలో ఆ కోడ్‌ను చూపించాలి
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోని 'బుక్‌డ్ టికెట్ హిస్టరీ' విభాగంలో ఇ-ప్యాంట్రీ మీల్ ఆప్షన్ కనిపిస్తుంది. భోజనం బుక్ చేసిన వెంటనే ప్రయాణికులకు ఒక మీల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. డెలివరీ సమయంలో ఆ కోడ్‌ను చూపించాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ కూడా ఈ ఇ-ప్యాంట్రీ సేవల జాబితాలో ఉండడం విశేషం. దశలవారీగా మరిన్ని రైళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Details
ఇ-ప్యాంట్రీ ముఖ్య ఫీచర్లు
ఇ-ప్యాంట్రీ ద్వారా ప్రయాణికులు స్టాండర్డ్ మీల్స్ లేదా 'రైల్‌నీర్' ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. రైలు ఎక్కిన తర్వాత ఆహారం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లింపులు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఫుడ్ బుక్ చేసిన వెంటనే మీల్ వెరిఫికేషన్ కోడ్ అందుతుంది. ఆర్డర్ చేసిన భోజనం తయారీ నుంచి డెలివరీ వరకు ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. ఏదైనా కారణంతో ఫుడ్ డెలివరీ కాకపోతే, ఆ వివరాలను ఎస్‌ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. అటువంటి సందర్భాల్లో రీఫండ్ కూడా ఆన్‌లైన్‌లోనే స్వయంచాలకంగా జమ అవుతుంది.