LOADING...
Niti Aayog: దేశంలో లక్షకుపైగా పాఠశాలలకు విద్యుత్ లేదు.. 98 వేల స్కూళ్లలో బాలికల టాయిలెట్లు లేవు: నీతి ఆయోగ్ నివేదిక
98 వేల స్కూళ్లలో బాలికల టాయిలెట్లు లేవు: నీతి ఆయోగ్ నివేదిక

Niti Aayog: దేశంలో లక్షకుపైగా పాఠశాలలకు విద్యుత్ లేదు.. 98 వేల స్కూళ్లలో బాలికల టాయిలెట్లు లేవు: నీతి ఆయోగ్ నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని వేలాది పాఠశాలలు ఇప్పటికీ కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నాయని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. "స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా" పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 1.19 లక్షల స్కూళ్లలో విద్యుత్ సౌకర్యం లేదని, 98,592 పాఠశాలల్లో బాలికలకు ఉపయోగించే టాయిలెట్లు పనిచేయడం లేదని తెలిపింది. అలాగే 61,540 స్కూళ్లలో వినియోగించగల టాయిలెట్ కూడా లేదని పేర్కొంది. 14,505 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేకపోగా.. 59,829 స్కూళ్లలో చేతులు కడుక్కునే సదుపాయం కూడా లేదని వెల్లడించింది.

వివరాలు 

ఒక్క టీచర్‌తోనే నడుస్తున్న దేశంలని 1,04,125 స్కూళ్లు

ప్రభుత్వ సెకండరీ స్కూళ్లలో కేవలం 51.7 శాతం పాఠశాలల్లో మాత్రమే సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయని నివేదిక తెలిపింది. మరోవైపు దేశంలో 1,04,125 స్కూళ్లు ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయని పేర్కొంది. వీటిలో 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని వెల్లడించింది. జార్ఖండ్‌లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 47:1గా ఉందని, ఇది ఆదర్శ ప్రమాణాలకు చాలా ఎక్కువని నివేదికలో పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో బీహార్‌లో 2లక్షలకు పైగా టీచర్ ఖాళీలు ఉండగా,జార్ఖండ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా భారీ ఖాళీలతో వెనుకబడ్డాయి. టీచర్ల నైపుణ్యాలపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గణితంలో 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించగలిగే టీచర్లు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారని తెలిపింది. సగటు మార్కులు 46 శాతంగానే ఉన్నాయని వెల్లడించింది.

వివరాలు 

సెకండరీ స్థాయిలో డ్రాప్‌అవుట్ రేటు కూడా ఆందోళనకరం

ఎన్నికలు, సర్వేలు, ఇతర పరిపాలనా పనుల కారణంగా టీచింగ్ డేస్‌లో సగటున 14 శాతం రోజులు వృథా అవుతున్నాయని పేర్కొంది. దేశంలో 7,993 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదని నివేదిక తెలిపింది. ఇలాంటి "ఘోస్ట్ స్కూళ్లు" అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు సెకండరీ స్థాయిలో డ్రాప్‌అవుట్ రేటు కూడా ఆందోళనకరంగా ఉందని వెల్లడించింది. దేశ సగటు 11.5 శాతంగా ఉండగా.. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో ఇది మరింత ఎక్కువగా నమోదైంది. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా మధ్యలో చదువు మానేసే విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

Advertisement

వివరాలు 

విద్యపై భారత్ జీడీపీలో కేవలం 4.6 శాతం మాత్రమే ఖర్చు

విద్యపై భారత్ జీడీపీలో కేవలం 4.6 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది. యూకే, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలతో పోలిస్తే ఇది తక్కువని పేర్కొంది. ఇక విద్యా ఫలితాల పరంగా జార్ఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు వెనుకబడ్డాయని.. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు సాధించాయని వెల్లడించింది.

Advertisement