LOADING...
Hyderabad: డీజే మోతలు, రెయిన్‌డ్యాన్స్‌లతో నగరం రంగుల మయం
డీజే మోతలు, రెయిన్‌డ్యాన్స్‌లతో నగరం రంగుల మయం

Hyderabad: డీజే మోతలు, రెయిన్‌డ్యాన్స్‌లతో నగరం రంగుల మయం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోలీ పండుగంటే నగరం అంతా రంగుల హరివిల్లు కమ్ముకున్నట్టే ఉంటుంది. రంగురంగుల గులాల చిమ్మర్లు, డప్పు-డోలు వాయిద్యాల గోల, రెయిన్‌డ్యాన్స్‌ల సందడి, డీజే మోతలతో వీధులన్నీ కిక్కిరిసిపోతాయి. పండుగ సమయం దగ్గరపడుతుందంటే యువతలో ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఆ ఉత్సాహానికి తగ్గట్టుగానే ఈసారి నగరంలో ఈవెంట్ మేనేజర్లు భారీ స్థాయిలో హోలీ కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఒకవైపు పర్యావరణానికి మేలు చేసే విధంగా వేడుకలను రూపొందిస్తూనే, మరోవైపు ప్రముఖులను ఆహ్వానించి యువతను ఆకట్టుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఈ సంబరాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని పార్టీ ప్రియులు స్పష్టం చేస్తున్నారు.

వివరాలు 

భారీ స్థాయిలో వేడుకలు

ఈసారి మంగళవారం, బుధవారం ఇలా రెండు రోజుల పాటు హోలీ వేడుకలు నిర్వహించనున్నారు. మొత్తం మీద 50కుపైగా ఈవెంట్లు నగరంలో జరగనున్నాయి. ముఖ్యంగా 4వ తేదీన ఎక్కువ కార్యక్రమాలు ఉండనున్నాయి. అందుకు అనుగుణంగా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కార్నివాల్ డ్యాన్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, పుణె, పంజాబ్ నుంచి ప్రత్యేకంగా ధోల్ కళాకారులను ఆహ్వానిస్తున్నారు. మడ్‌పిట్‌లు, రెయిన్‌డ్యాన్స్ జోన్లు, సెలబ్రిటీ డీజేలు, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు సందడిని రెట్టింపు చేయనున్నాయి. నెక్లెస్ రోడ్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి వరకు నగరంలోని అనేక ప్రదేశాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.

వివరాలు 

పర్యావరణ హితం..

గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి హోలీ వేడుకలు పర్యావరణ హితంగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సాధారణంగా వినియోగించే సింథటిక్ రంగులను ఎక్కువగా ఉపయోగించబోమని నిర్వాహకులు చెబుతున్నారు. పలు వేదికల వద్ద ప్రత్యేక థీమ్‌లతో కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఒక ఈవెంట్ మేనేజర్ మాట్లాడుతూ, 'జంగిల్ హోలీ నుంచి లాఠ్ మార్ హోలీ వరకు విభిన్న శైలుల్లో ఈసారి వేడుకలు జరగనున్నాయి. సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రాధాకృష్ణ హోలీ పేరుతో ఒక కార్యక్రమం ఉంటే, ధమాకా హోలీ పేరుతో మరొకటి ప్రారంభమవుతోంది' అని తెలిపారు. ఏ ఈవెంట్ అయినా రెయిన్‌డ్యాన్స్, డీజే కార్యక్రమాలు సాధారణంగా ఉంటాయని,కొన్నిచోట్ల భంగ్ లభించవచ్చని, అయితే దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ భోజన ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు.

Advertisement

వివరాలు 

సెలబ్రిటీల సందడి

గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో జరిగే హోలీ వేడుకల్లో సింథటిక్ రంగుల వినియోగం తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఈసారి ప్రముఖుల హాజరు మరింత పెరిగింది. అనన్య నాగళ్ల, మంగ్లీ, తేజుప్రియ, అనసూయ, రోల్ రైడా వంటి ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. వారి పాల్గొనికతో ఈ వేడుకలు మరింత ఉత్సాహభరితంగా మారనున్నాయి.

Advertisement