Nuzivedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల మంది విద్యార్థులకు అస్వస్థత
ఈ వార్తాకథనం ఏంటి
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందలమంది విద్యార్థులు వారం రోజులుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి చేరుతున్నారు.
విద్యార్థులు తీవ్ర అస్వస్థతతో ఉన్నా,యాజమాన్యం ఈ విషయం బయటకు పొక్కకుండా చర్యలు తీసుకుంటోంది.
నూజివీడు ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహించబడుతుంది. ఈనెల 23 నుంచి ఈ రెండు క్యాంపస్‌లలో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు.
ముఖ్యంగా మూడు మెస్‌లలో భోజనం చేసిన విద్యార్థులలో అనారోగ్యం మరింతగా కనపడుతోంది.ఇదే క్రమంలో, నాలుగు రోజులుగా అనారోగ్యం మరింత తీవ్రమవుతూ వస్తోంది.
ఆదివారం 165 మంది, సోమవారం 229 మంది, మంగళవారం 345 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందగా, బుధవారం మొదటి షిఫ్ట్‌లోనే 131 మంది చేరారు.
వివరాలు
రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నాలు
వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే, లెక్కల ప్రకారం 400 మందిని మాత్రమే చూపిస్తున్నారు.
ఆసుపత్రికి వచ్చినవారి పేర్లు ఓపీలో నమోదు చేయకుండా రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది.
అధికారులు మెస్‌లను పరిశీలించినప్పటికీ,లోపాలను సరిచేసే చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వంటశాలల్లో పరిశుభ్రత కొరవడటంతో పాటు, వంట పాత్రలు, విద్యార్థుల తినే కంచాలు సరిగా శుభ్రం చేయడం లేదని విమర్శలు ఉన్నాయి.
వివరాలు
లోకేశ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
పులిసిపోయిన పెరుగు, సరిగా కాల్చని చపాతీలను విద్యార్థులకు వడ్డించడం, నీటిలో సాంబారు తయారు చేయడం వంటి విషయాలు సమస్యలను మరింత తీవ్రం చేస్తున్నాయి.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, విద్యార్థుల ఆరోగ్యంపై అధిక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి' అంటూ ఎక్స్‌లో తెలిపారు.
మంత్రి ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో షర్మిష్ఠ ట్రిపుల్ ఐటీ మెస్‌లను, ఆసుపత్రిని సందర్శించి, పరిశుభ్రతలో లోపాలు ఉన్నాయని నిర్ధారించారు.
దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు.