PM CARES: కోవిడ్ అనాథల కోసం పిఎం కేర్స్ దరఖాస్తుల్లో సగానికి పైగా తిరస్కారం
కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల్లో 51 శాతం తిరస్కరించారు. మూలాధారాలను ఉటంకిస్తూ ఈ వార్తలు వచ్చాయి. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ భారతదేశంలో కోవిడ్-19 కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత మే 29, 2021న ప్రారంభించారు. మార్చి 11, 2020- మే 5, 2023మధ్య మహమ్మారి కారణంగా వారి తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు,పెంపుడు తల్లిదండ్రులు లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేయడం PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం లక్ష్యం. అధికారిక సమాచారం ప్రకారం,33 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 613 జిల్లాల నుండి ఈ పథకం కింద మొత్తం 9,331 దరఖాస్తులు వచ్చాయి.
పిల్లలకు నిరంతర సమగ్ర సంరక్షణ,రక్షణ కల్పించడం ఈ పథకం లక్ష్యం
అయితే, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారి వార్తా ఏజెన్సీతో పంచుకున్న డేటా ప్రకారం, 32 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో 558జిల్లాల నుండి 4,532 దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడ్డాయి. అదే సమయంలో 4,781 దరఖాస్తులు తిరస్కరించగా 18 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుల తిరస్కరణకు సంబంధించిన నిర్దిష్ట కారణాలను మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. రాష్ట్రాలలో,రాజస్థాన్,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లు వరుసగా 1,553,1,511,1,007 దరఖాస్తులతో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను నివేదించాయి. ఆమోదించబడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర నుండి 855,రాజస్థాన్ నుండి 210,ఉత్తరప్రదేశ్ నుండి 467 ఉన్నాయి. ఈ పథకం లక్ష్యం ఈ పిల్లలకు నిరంతర సమగ్ర సంరక్షణ,రక్షణ కల్పించడం. అలాగే, వారికి 23 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆరోగ్య బీమా,విద్యా సాధికారత, ఆర్థిక సహాయం అందించాలి.