Andhrapradesh: ఏపీలో 51 లక్షల టన్నుల వరి సేకరణ లక్ష్యం.. పారదర్శకంగా కొనుగోళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రైతులకు కనీస మద్దతు ధర (MSP) వెంటనే అందేలా,ఎటువంటి విధానపరమైన ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు వరి కొనుగోళ్లను ప్రారంభించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అరుగొలను గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం 51 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3,013రైతు సేవా కేంద్రాలు, 2,061వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాణ్యతా ప్రమాణాల ప్రకారం పారదర్శకంగా,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వరి గింజను సేకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మనోహర్ తెలిపారు.
వివరాలు
48 గంటల లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమయ్యేలా చర్యలు
సేకరణ పనులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు దాదాపు 10,700 మంది సిబ్బందిని నియమించారు. రైతులకు స్నేహపూర్వకంగా సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అమ్మకం జరిగిన 48 గంటల లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే గన్నీ సంచులు, తేమ పరీక్ష యంత్రాలు, రవాణా సదుపాయాలు వంటి అంశాలలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూడాలని ఆయన ఆదేశించారు. 2024లో జరిగిన ధాన్యం సేకరణలో ఎదురైన సవాళ్ల నుండి పాఠాలు నేర్చుకొని, ఈ సంవత్సరం మొత్తం కార్యకలాపాలు సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించామని మంత్రి వెల్లడించారు.
వివరాలు
ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు
సేకరణ సమయంలో ఏవైనా ఆటంకాలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. రైతులు తమ వరి అమ్మకాలను వేగవంతం చేయాలంటే వాట్సాప్ నంబర్ 7337359375 కు 'హాయ్' అని మెసేజ్ పంపి ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో అమ్మకపు ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈసారి ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో తహసీల్దారు, ఎంఏవో, టెక్నికల్ అసిస్టెంట్ సభ్యులుగా ఉన్నారని మంత్రి తెలిపారు. రైతులకు ఏ సమస్యలు ఎదురైనా ఈ టీమ్ తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టింది.