
India-Pakistan: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దు.. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు భారత్ విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్ సీమాంతర కుట్రే కారణమని భారత్ పేర్కొంది.
దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.
ముఖ్యంగా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా మరో చర్యను చేపట్టింది.
పాకిస్తాన్‌కు ఉగ్రవాదాన్ని పెంచడానికి నిధులు అందించకూడదని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ను కోరింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడీబీ చీఫ్ మసాటో కాందతో ఇటీవల భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ విషయంపై ఇటలీ ఆర్థిక మంత్రి, పలు ఐరోపా దేశాల నేతలతోనూ నిర్మలమ్మ చర్చలు జరిపినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)గ్రేలిస్టులో పాకిస్తాన్‌ను పెట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
వివరాలు
పాకిస్తాన్‌పై మరో భారీ ఆర్థిక దెబ్బ
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)నుంచి పాకిస్తాన్‌కు అందే 7 బిలియన్ డాలర్ల సాయంపై న్యూదిల్లీ ఆందోళన వ్యక్తం చేయనుంది.
తాజాగా,ఏడీబీ నుంచి పాకిస్తాన్‌కు అందే నిధులను కూడా నిలిపివేయాలని భారత్ అభ్యర్థన చేసింది.
న్యూదిల్లీ అభ్యర్థనకు అంగీకరించి,పాక్‌కు నిధులు ఆపేస్తే, ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన పాకిస్తాన్‌పై మరో భారీ ఆర్థిక దెబ్బ పడుతుంది.
ఇదిలా ఉంటే,ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్‌కు,అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)లో తాత్కాలిక విధులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మే 9న జరగనున్న సమావేశం నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
గత ఏడాది జులైలో ఐఎంఎఫ్-పాకిస్తాన్ మధ్య 7బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం ఒప్పందం ఖరారైంది.
ఆ రోజున పాకిస్తాన్ బెయిలౌట్ ప్యాకేజీపై సమీక్ష కూడా జరగనుంది.