LOADING...
PM Modi: 550 సంస్థానాల ఏకీకరణతో చరిత్ర సృష్టించిన పటేల్‌ : ప్రధాని మోదీ
550 సంస్థానాల ఏకీకరణతో చరిత్ర సృష్టించిన పటేల్‌ : ప్రధాని మోదీ

PM Modi: 550 సంస్థానాల ఏకీకరణతో చరిత్ర సృష్టించిన పటేల్‌ : ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

చరిత్రను కేవలం వ్రాయడం కంటే దానిని సృష్టించడం ముఖ్యమని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నమ్మారు. ఆ నమ్మకానికి తగినట్లుగానే దేశంలోని విభిన్న సంస్థానాలను ఏకీభవింపజేసి ఆయన భారత చరిత్రలో చిరస్మరణీయ ఘనత సాధించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం (Statue of Unity) వద్ద జరిగిన పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. "స్వాతంత్ర్యం అనంతరం 550 సంస్థానాలను ఒకే జాతీయ పటంలో చేర్చి అసాధ్యాన్ని సాధ్యంగా చేసినవారు సర్దార్ పటేల్. ఆయనకు 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అనే దార్శనికత ఎంతో ప్రాధాన్యమైనది. ఆ దృష్టికోణాన్నే మేము కొనసాగిస్తున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లాగానే ఇప్పుడు ఐక్యత దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంటున్నాం".

వివరాలు 

కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వలన కశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమించుకుంది

భారతీయులు ఐక్యంగా ఉండి, విభజన శక్తుల కుట్రలకు లోనుకాకుండా ఉండాలి. దేశ సమగ్రతకు నక్సలిజం పెద్ద ముప్పుగా మారింది. నక్సల్స్‌ను నిర్మూలించేందుకు అనేక ఆపరేషన్లు చేపట్టాం. ఆ దుష్ప్రభావాన్ని పూర్తిగా చెరిపేసేందుకు కట్టుబడి ఉన్నాం. కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని పటేల్ ఆశించారు, అయితే ఆ సమయంలో నెహ్రూ ఆ దిశగా ముందడుగు వేయలేదు. పటేల్‌, అంబేడ్కర్‌ల వంటి మహనీయులను కాంగ్రెస్‌ పార్టీ తగిన గౌరవం ఇవ్వకుండా అవమానించింది. వారి దూరదృష్టిని విస్మరించింది. ఆ కాలంలో కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వలన కశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమించుకుంది. దాంతో ఆ ప్రాంతంలో, దేశంలో అశాంతి వాతావరణం నెలకొంది. ఉగ్రవాదాన్ని పొరుగు దేశం ప్రోత్సహించింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ఉగ్రవాదుల ముందు తలవంచింది.

వివరాలు 

పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం,తపాలా స్టాంపు విడుదల

అయితే ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారతదేశ బలాన్ని ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూచింది. మన దేశం ఎంత శక్తివంతమో ఆ ఉగ్రవాదులకు అప్పుడు స్పష్టమైంది.దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలకు ప్రాధాన్యం ఇచ్చాం. సర్దార్ పటేల్ ఆకాంక్షలను గౌరవిస్తూ వాటిని అమలు చేయడానికి కృషి చేస్తున్నాం. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడం కొందరికి నచ్చకపోవచ్చు కానీ దేశం భద్రత కోసం అది అవసరం. మన భూమిలో చొరబాటుదారులను పూర్తిగా తొలగించే సంకల్పం మనందరిలో ఉండాలి,"అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం,తపాలా స్టాంపును విడుదల చేసినట్టు కూడా ఆయన తెలిపారు. ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరేడ్‌ నిర్వహించగా,సైనిక దళాల కవాతు ఆ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.