
Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తోందని భారతదేశం ఎన్నోసార్లు పేర్కొంది.
తాజాగా పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై చర్యలు తీసుకుంటున్న తరుణంలో, పాకిస్థాన్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.
గతంలో తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా ప్రస్తుతం తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు లేవని తేల్చిచెప్పుతోంది.
అయితే ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ప్రపంచం ముందుకు కీలక ఆధారాలు తీసుకొచ్చారు.
భారత దళాలు ఇటీవల పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడుల్లో మరణించిన జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ అంత్యక్రియల్లో పాకిస్థాన్ ప్రభుత్వ, సైనిక అధికారులు పాల్గొన్న ఫొటోను దొరైస్వామి జాతీయ మీడియాతో ఓ ఇంటర్వ్యూలో షేర్ చేశారు.
Details
జైషే మొహమ్మద్ సంస్థలో కీలక నేత రవూఫ్
శవపేటికలపై పాకిస్తాన్ జెండాలు కప్పబడి ఉండటం వల్ల ఈ ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారన్న సందేహాలకు ఇక ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇది పాక్ ఉగ్ర మద్దతుకు మరింత బలమైన సాక్ష్యమని పేర్కొన్నారు.
రవూఫ్ అజహర్ 1999లో జరిగిన ఐసీ814 విమాన హైజాక్‌తోపాటు, 2001లో పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌కోట్, 2019లో పుల్వామా ఉగ్రదాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఆయన ప్రస్తుతం జైషే మొహమ్మద్ సంస్థలో కీలక నేతగా కొనసాగుతున్నాడు.
Details
పాక్ కు ఉగ్ర చరిత్ర ఉంది : భుట్టో జర్దారీ
ఇక పాక్ ఉగ్రవాద మద్దతును బలపరిచే మరో ఉదాహరణగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిలిచాయి.
పాక్‌కు ఉగ్ర చరిత్ర ఉందనేది రహస్యం కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యమే ఇస్లామీకరణ, సైనికీకరణకు దారితీసిందన్నారు. ఉగ్రవాదం వల్ల తమ దేశానికి గణనీయమైన నష్టం వాటిల్లిందని, అందుకే పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకొని సంస్కరణలు చేపట్టామని వివరించారు.
అయితే ఇప్పుడు తమకు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించినా, భద్రతా నిపుణులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు.