
Sam Pitroda: పాకిస్తాన్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లు ఉంది.. రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా కామెంట్స్..
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పరిగణించే శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ రంగంలో చర్చలకు దారితీశాయి. పాకిస్థాన్‌తో సహా పొరుగు దేశాలతో చర్చలకు భారత్ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. భారత విదేశాంగ విధానం మొదలవ్వాల్సింది పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసే దిశగా కావాలని పిట్రోడా అభిప్రాయపడ్డారు. "నా దృష్టిలో మన విదేశాంగ విధానం ముందుగా పొరుగు దేశాలపై దృష్టి పెట్టాలి.వారితో మన సంబంధాలను చర్చల ద్వారా గణనీయంగా మెరుగుపరచుకోవచ్చా అన్నది చూడాలి.నేను పాకిస్తాన్ వెళ్లినప్పుడు,అక్కడ నాకు ఇంట్లో ఉన్నట్లే అనిపించింది. అలాగే బంగ్లాదేశ్,నేపాల్ వెళ్లినప్పుడు కూడా అదే అనుభూతి కలిగింది.ఆ దేశాల్లో నేను విదేశాల్లో ఉన్నాననే భావన రావడం లేదు" అని వివరించారు.
వివరాలు
కాంగ్రెస్ అంటే పాకిస్తాన్‌కు ఇష్టమైన పార్టీ
అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ దేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడు, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ అయిన శామ్ పిట్రోడా పాకిస్తాన్‌లో కూడా తనకు స్వగృహంలో ఉన్నట్లే అనిపిస్తోందని అంటున్నారు. అందుకే 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోలేకపోయింది. కాంగ్రెస్ అంటే పాకిస్తాన్‌కు ఇష్టమైన పార్టీ" అని తీవ్ర విమర్శలు చేశారు.