
LoC: ఎల్‌ఓసీ వెంబడి మరోసారి పాక్ కాల్పులు.. 12వ రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది.
నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ సైనికులు వరుసగా 12వ రోజు కూడా కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 8 సెక్టార్లలో పాక్ కవ్వింపు చర్యలు చేపట్టింది.
కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషెరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరపడంతో భారత సైనికులు సమర్థంగా ప్రతీకారం తీశారు.
ఏప్రిల్ 22న శ్రీనగర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు సింధూ జలాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్నారు.
Details
ఉగ్ర స్థావరం గుర్తించిన భద్రతా బలగాలు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు, జమ్ము కశ్మీర్‌లో మరో కీలక విజయం సాధించాయి.
పూంచ్ జిల్లా సురాన్‌కోట్ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించారు. ఈ స్థావరంలో టిఫిన్ బాక్సుల్లో మూడు, స్టీల్ బకెట్లలో రెండు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇవన్నీ భారీ విస్ఫోటాలకు దారి తీసే సామర్థ్యం కలిగినవని అధికారులు వెల్లడించారు.
ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నాయి.
భారత్ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులు నాజూకుగా మారుతున్న నేపథ్యంలో, కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.