LOADING...
Pakistan: టర్కీ సహాయంతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను బంగ్లాదేశ్, నేపాల్‌కు తరలిస్తోంది 
టర్కీ సహాయంతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను బంగ్లాదేశ్, నేపాల్‌కు తరలిస్తోంది

Pakistan: టర్కీ సహాయంతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను బంగ్లాదేశ్, నేపాల్‌కు తరలిస్తోంది 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విస్తరించేందుకు కుతంత్రాలు పన్నుతోందని భారత నిఘా సంస్థలు తెలియజేశాయి. ఈ లక్ష్యంతో భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కొత్తగా ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారత్-బంగ్లాదేశ్,భారత్-నేపాల్ సరిహద్ధులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరాల ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయని, ఆపరేషన్ సిందూర్ అనంతరం ఈ ప్రక్రియ మరింత వేగం తీసుకున్నట్లు ఆంగ్ల పత్రికల్లో ప్రచురితమైన నివేదికల్లో పేర్కొన్నారు.

వివరాలు 

సరిహద్దు భద్రత మరింత కట్టుదిట్టం

ఉగ్రవాద కార్యకలాపాలకు చేరే వారి కోసం నేపాల్, బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల్లో కొత్త నివాసాలు, శిక్షణ శిబిరాలు ఏర్పడుతున్నట్లు నిఘా శాఖ పేర్కొంటోంది. తాజాగా ఈ రెండు దేశాలకు సమీపంగా ఉన్న భారత రాష్ట్రాల్లో పాకిస్తాన్ మద్దతు పొందిన ఉగ్ర సంఘాలకు చెందిన పలువురు కార్యకర్తలు అరెస్టు కావడంతో, విచారణలో ఈ వివరాలు బయటపడినట్లు వెల్లడించారు. దాంతో సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులపై కూడా నిఘా కట్టి ఉంచినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

బంగ్లాదేశ్‌లో తమ ఉనికిని బలపరిచేందుకు ప్రయత్నాలు

లష్కరే తయ్యిబా (LeT), జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు నేపాల్‌లో తమ ప్రభావాన్ని పెంచేందుకు పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు వివరించాయి. అలాగే అల్‌-ఖైదా, ఐసిస్ సంస్థలు గత అయిదు నెలలుగా బంగ్లాదేశ్‌లో తమ ఉనికిని బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రాంతాల నుంచి నిరంతరం బంగ్లాదేశ్, నేపాల్‌కు వ్యక్తులు తరలివస్తున్నారని చెప్పారు. అలాగే ఈ ఉగ్ర శిబిరాలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి కావలసిన నిధులను తుర్కియే అందిస్తోందని నిఘా సమాచారం వెల్లడించింది. ఢాకాలో ఉన్న జమాత్-ఇ-ఇస్లామీ కార్యాలయ పునర్నిర్మాణానికి కూడా తుర్కియే నిఘా సంస్థ సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.