Jammu and kashmir: జమ్ముకశ్మీర్ రాజౌరిలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మరో జవాన్ వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో గురువారం ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు జవాన్లు సహా నలుగురు ఆర్మీ సిబ్బంది బుధవారం మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో సైనికుడు ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడగా, వారిని ఉదంపూర్‌లోని ఆర్మీ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు, ఆర్మీ సంయుక్త బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒక మేజర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి, గాయపడిన వారిని కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ తర్వాత ధర్మాల్‌లోని బాజిమాల్ ప్రాంతంలోని ఆర్మీ కమాండ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
క్వారీ శిక్షణ పొందిన స్నైపర్
రాజౌరి జిల్లా ప్రాంతంలో రాత్రిపూట ఆగిన కాల్పులు ఈ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఆదనపు భద్రతా బలగాలలు చుట్టుముట్టడంతో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఉగ్రవాదులు తప్పించుకోవడంలో విఫలమయ్యారు. రాజౌరి జిల్లాలోని కలకోట్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్థానీ, అతడిని క్వారీగా గుర్తించారు. డాంగ్రీ, కాండీ జంట దాడులకు క్వారీ ప్రధాన సూత్రధారి. ఈ దాడులలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు అతన్ని పంపారు. అతడు పేలుడు పదార్థాల తయారీతోపాటు గుహల్లో నక్కి ఉగ్రకార్యకలాపాలు నిర్వహించడంలో నిపుణుడు. శిక్షణ పొందిన స్నైపర్ కూడా' అని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.