job scam: కంబోడియా జాబ్ స్కామ్‌లో పాకిస్థాన్ లింక్… కేంద్ర దర్యాప్తులో సంచలన అంశాలు
ఈ వార్తాకథనం ఏంటి
2024లో వెలుగులోకి వచ్చిన కంబోడియా కేంద్రంగా సాగిన ఉద్యోగ మోసం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న హై-లెవల్ విచారణలో తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన లింక్ బయటపడింది. నకిలీ ఉద్యోగాల పేరుతో వందలాది మంది భారతీయులను కంబోడియాకు తరలించి,అక్కడ దోపిడీకి గురిచేసిన ఈ స్కామ్‌లో పాకిస్థాన్ ఏజెంట్ల పాత్ర ఉందని బాధితులు అధికారులకు తెలిపారు. ఈ విషయాన్ని వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఈ స్కామ్ 2024లో బయటపడింది. అప్పట్లో 5,000 మందికిపైగా భారతీయులు కంబోడియాలో చిక్కుకుపోయారని అధికారులు అంచనా వేశారు. మంచి జీతాల ఉద్యోగాలు ఇస్తామంటూ విదేశాలకు రప్పించిన వీరిని,తర్వాత సైబర్ నేరాలకు బలవంతంగా పనిచేయించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పలువురు బాధితులను రక్షించి భారత్‌కు తీసుకువచ్చారు.
వివరాలు
ఫోరెన్సిక్ విశ్లేషణలో పాకిస్థాన్‌కు చెందిన డిజిటల్ ఆధారాలు
ఈ మోసాలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత రాయబార కార్యాలయం, కంబోడియాలో ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులు అనధికార ఏజెంట్లను నమ్మొద్దని పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కొందరు మోసగాళ్ల వలలో చిక్కారు. అధికారుల ప్రకారం, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన చాట్స్, కాల్స్‌పై చేసిన ఫోరెన్సిక్ విశ్లేషణలో పాకిస్థాన్‌కు చెందిన డిజిటల్ ఆధారాలు బయటపడ్డాయి. అక్కడి నుంచి పనిచేసిన హ్యాండ్లర్లకు సంబంధించిన IP లాగ్స్ గుర్తించినట్టు నివేదిక తెలిపింది. ఈ దర్యాప్తులో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ముంబయి, తెలంగాణ, కేరళ వంటి ప్రాంతాలకు చెందిన ఉద్యోగార్థులను టార్గెట్ చేసిన వ్యవస్థీకృత నెట్‌వర్క్ ఉందని అధికారులు తెలిపారు.
వివరాలు
'సస్పెక్ట్ రిజిస్ట్రీ'లో పాకిస్థాన్‌కు సంబంధించిన IP అడ్రస్‌లు
ఈ అంశంపై డిసెంబర్‌లో జరిగిన రెండు రోజుల యాంటీ-టెర్రరిజం కాన్ఫరెన్స్-2025లో కూడా చర్చ జరిగింది. "ఇది కేవలం సైబర్ మోసం కాదు... మన యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఆపరేషన్" అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ కేసులో CBI, NIA తమ దర్యాప్తును వేగవంతం చేశాయి. పాకిస్థాన్‌కు సంబంధించిన IP అడ్రస్‌లు గుర్తించిన తర్వాత, కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని 'సస్పెక్ట్ రిజిస్ట్రీ'లో చేర్చాయి. ఈ రిజిస్ట్రీని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) రూపొందించింది. ఇందులో ఆర్థిక మోసాలు, ఇతర సైబర్ నేరాల్లో పాల్గొన్న 14 లక్షల మంది నేరగాళ్ల వివరాలు ఉన్నాయి. ఈ డేటాబేస్‌ను బ్యాంకులతో పంచుకున్నారు.
వివరాలు
రిజిస్ట్రీ సహాయంతో ఇప్పటివరకు 5,54,865 బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్
ఈ రిజిస్ట్రీ సహాయంతో ఇప్పటివరకు 5,54,865 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం, 15,10,800 ప్రత్యేక ఖాతాలను గుర్తించడం, అలాగే దాదాపు 20 లక్షల అనుమానాస్పద లావాదేవీలను అడ్డుకోవడం ద్వారా రూ.7,980 కోట్ల నష్టాన్ని నివారించడం సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఒక అధికారి మాట్లాడుతూ, భారతీయులను లక్ష్యంగా చేసుకున్న చాలా సైబర్ స్కామ్‌లు దక్షిణాసియాలోని కఠిన భద్రత కలిగిన శిబిరాల నుంచి చైనా నిర్వాహకులు నడుపుతున్నారని చెప్పారు. అక్కడ మానవ అక్రమ రవాణాకు గురైన భారతీయులను కూడా బలవంతంగా పనిచేయిస్తున్నట్టు వెల్లడించారు.
వివరాలు
చీటింగ్ కేసుల వల్ల రూ.52,976 కోట్లకు పైగా నష్టం
I4C గణాంకాల ప్రకారం, గత ఆరు సంవత్సరాల్లో భారత్‌లో మోసాలు, చీటింగ్ కేసుల వల్ల రూ.52,976 కోట్లకు పైగా నష్టం జరిగింది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా క్యాసినోలు, కాల్ సెంటర్లలో భారీ జీతాల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను మోసగించారు. అక్కడికి వెళ్లాక బలవంతపు కూలీ పని, శారీరక వేధింపులు, అవయవాల అక్రమ రవాణా బెదిరింపులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. ఈ స్కామ్ బయటపడిన తర్వాత భారతీయులపై జరిగిన భయంకరమైన హింస, దౌర్జన్యాల వివరాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.