
Tragedy: అన్న వరస అవుతాడని పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణ.. చివరికి యువతి ఆత్మహత్య!
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని ప్రేమకథలు సుఖాంతం చెంది పెళ్లి బంధంతో ముగుస్తుంటే.. మరికొన్ని ప్రేమలు దురదృష్టకరంగా విషాదాంతం అవుతున్నాయి. పెద్దల నిరాకరణతో ప్రేమికులు నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడే సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా అలాంటి హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక నెరవేరకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ స్వరూప, కేశ్య నాయక్ దంపతుల మూడో కూతురు సక్కుబాయి (21). ఆమె ఎంబీఏ పూర్తి చేసి, ప్రస్తుతం గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతోంది. చదువుతో పాటు భవిష్యత్‌లో మంచి ఉద్యోగం సాధించాలని తలపోసుకుంది.
Details
గడ్డి మందు తాగి ఆత్మహత్య
అయితే హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే సమయంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. అతడినే పెళ్లి చేసుకోవాలని సక్కుబాయి నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పటికీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ వ్యక్తి వరసకు అన్న అవుతాడని, కాబట్టి పెళ్లి సాధ్యం కాదని అడ్డుకున్నారు. దీంతో సక్కుబాయి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ప్రేమించిన వ్యక్తిని వదిలిపెట్టలేని స్థితిలో కుంగిపోయింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గడ్డిమందు తాగి ప్రాణాలకు తెగబడింది. ఆ తర్వాత తండ్రికి ఫోన్ చేసి విషయం తెలిపింది.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
వెంటనే తండ్రి ఇంటికి చేరుకొని ఆమెను నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించి సక్కుబాయి మృతి చెందింది. ఉన్నత చదువులు పూర్తి చేసి, భవిష్యత్తులో తమకు తోడుగా నిలుస్తుందని భావించిన కూతురు అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.