Sharad Pawar-Ajit Pawar: మహా రాజకీయాల్లో కీలక పరిణామం.. కలిసిపోయిన పవార్ కుటుంబం..
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది. శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎన్‌సీపీ వర్గాలు పింప్రీ-చించ్వాడ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్వయంగా వెల్లడించారు. ఈ కొత్త రాజకీయ కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహించనున్నారని తెలిపారు. మహారాష్ట్రలో జనవరి 15న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మొత్తం 28 మున్సిపల్ కార్పొరేషన్లు, 32 జిల్లా పరిషత్తులు, 336 పంచాయతీ సమితులకు ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు.
వివరాలు
కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు ప్రక్రియ
ఈ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై జరిగిన చర్చల అనంతరం కలిసి బరిలో దిగాలనే నిర్ణయం తీసుకున్నామని పింప్రీ-చించ్వాడ్‌లో నిర్వహించిన ర్యాలీలో అజిత్ పవార్ వెల్లడించారు. ఈ పరిణామాలపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, మహారాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రచారంపై పూర్తిగా దృష్టి పెట్టాలని, వివాదాలకు దారితీసే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆయన మద్దతుదారులకు సూచించారు. ఇదే తరహాలో పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
స్థానిక ఎన్నికలు ఇటు పవార్లతో పాటు అటు ఠాక్రేలను కలిపింది
ఈ స్థానిక ఎన్నికలు పవార్ కుటుంబంతో పాటు ఠాక్రే కుటుంబాన్ని కూడా దగ్గర చేశాయి. మరాఠీల హితాలు, మహారాష్ట్ర అభివృద్ధి కోసం తామంతా ఏకమయ్యామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రకటించారు. బీఎంసీ మేయర్ పదవి తమకే దక్కుతుందన్న ధీమాను వారు వ్యక్తం చేశారు. ఇతర మున్సిపల్ సంస్థల విషయంలో కూడా పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ రాజకీయ కుటుంబాల పునఃఏకీకరణ మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందన్న దానిపై విస్తృత ఆసక్తి నెలకొంది.