Bengaluru: బెంగళూరులో ఇంటి ముందు పార్కింగ్‌కు కొత్త రూల్స్.. ఏటా రూ.25 వేల వరకు రుసుము
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు నగరంలో నివసిస్తున్న వాహనదారులకు కొత్త నిబంధనలు రానున్నాయి. ఇకపై ఇళ్ల ముందు ఉన్న పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేయాలంటే వార్షిక రుసుము చెల్లించి 'రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్' తీసుకోవాల్సి రావచ్చు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) రూపొందించిన 'పార్కింగ్ రూల్స్-2026' ముసాయిదాలో ఈ ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం ఏటా గరిష్ఠంగా రూ.25,000 వరకు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
వాహనం రకాన్ని బట్టి ఫీజు..
ముసాయిదా నిబంధనల్లో వాహనాల రకాన్ని బట్టి వార్షిక పర్మిట్ ఫీజులను ప్రతిపాదించారు.
హ్యాచ్‌బ్యాక్ కార్లకు రూ.15,000, సెడాన్ కార్లకు రూ.20,000, ఎస్‌యూవీలకు రూ.25,000 చొప్పున వసూలు చేయాలని పేర్కొన్నారు.
అయితే పర్మిట్ పొందేందుకు ఒక ముఖ్యమైన నిబంధనను కూడా పెట్టారు.
భవన నిర్మాణ నిబంధనల ప్రకారం కనీస పార్కింగ్ సౌకర్యం ఉన్న భవనాల్లో నివసించే వారికి మాత్రమే రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ జారీ చేస్తారు.
అంటే.. అపార్ట్‌మెంట్ లేదా ఇంటికి నిబంధనల ప్రకారం సొంత పార్కింగ్ స్థలం అందుబాటులో లేని వారు పబ్లిక్ రోడ్లపై వాహనం నిలిపేందుకు ఈ పర్మిట్ పొందలేరు.
వివరాలు
పర్మిట్ లేకుండా పార్కింగ్ చేస్తే జరిమానా..
బెంగళూరు నగరంలో రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం వల్ల ట్రాఫిక్‌కు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త పార్కింగ్ నిబంధనలను ప్రతిపాదించారు.
చెల్లుబాటయ్యే పర్మిట్ లేకుండా పబ్లిక్ రోడ్డుపై వాహనం పార్క్ చేస్తే దాన్ని చట్టవిరుద్ధమైన పార్కింగ్‌గా పరిగణించి జరిమానా విధించనున్నారు.
ఈ పర్మిట్‌ను ఒక నిర్దిష్ట వ్యక్తి, ఒక నిర్దిష్ట వాహనానికి మాత్రమే జారీ చేస్తారు. పర్మిట్ కాలపరిమితి ఒక సంవత్సరం.
గడువు ముగిసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్‌గా పునరుద్ధరించరు. దరఖాస్తుదారు ఇప్పటికీ అదే ప్రాంతంలో నివసిస్తున్నారని నిర్ధారించిన తర్వాతే పర్మిట్‌ను పునరుద్ధరించనున్నారు.
వివరాలు
ఇంటికి సమీపంలోని రోడ్లలోనే అనుమతి..
రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ ఉన్నా అన్ని రోడ్లపై వాహనాన్ని నిలపడానికి అనుమతి ఉండదు.
ఇంటి నుంచి నడిచి వెళ్లగలిగే దూరంలో, పార్కింగ్‌కు ప్రత్యేకంగా నిర్దేశించిన రోడ్లలో మాత్రమే ఈ పర్మిట్ చెల్లుతుంది.
మరో ప్రాంతానికి వెళ్లి వాహనాన్ని పార్క్ చేస్తే నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు.
అలాగే ఆర్టీరియల్, సబ్-ఆర్టీరియల్ రోడ్లపై పార్కింగ్‌కు అనుమతి ఉండదు. వీటికి మినహా ఇతర రోడ్లలోనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అక్కడ కూడా ట్రాఫిక్ రాకపోకలకు కనీసం 6 మీటర్ల రహదారి ఖాళీగా ఉండాలి.
వివరాలు
ఇంటికి సమీపంలోని రోడ్లలోనే అనుమతి..
పాదచారుల కోసం రోడ్డుకు ఇరువైపులా కనీసం 1.8 మీటర్ల వెడల్పు ఉన్న ఫుట్‌పాత్ మార్గం అందుబాటులో ఉండేలా చూడాలి.
ప్రస్తుతం ఈ నిబంధనలు ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి.
వీటిపై ప్రజల అభిప్రాయాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
త్వరలో బెంగళూరు పార్కింగ్ రూల్స్-2026పై తుది నిర్ణయం వెలువడనుంది.