Loading...
Parliament Monsoon: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక చట్టాలకు కేంద్రం,ఆందోళనలకు ప్రతిపక్షం
కీలక చట్టాలకు కేంద్రం,ఆందోళనలకు ప్రతిపక్షం

Parliament Monsoon: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక చట్టాలకు కేంద్రం,ఆందోళనలకు ప్రతిపక్షం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. అధికార ఎన్డీఏ ప్రభుత్వం పలు ముఖ్యమైన బిల్లులను సభ ఆమోదానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రతిపక్ష ఇండియా కూటమి వివిధ ప్రజా, రాజకీయ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వ్యూహం రూపొందించింది. దీంతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు, గందరగోళం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

పార్లమెంట్ భవనంలో ఇండియా కూటమి కీలక నేతలు సమావేశం

సమావేశాల ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో ఇండియా కూటమి కీలక నేతలు సమావేశం కానున్నారు.

ఈ భేటీలో ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం, ప్రభుత్వంపై ఉమ్మడిగా చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై చర్చించి ఫ్లోర్ లీడర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారం, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలు వంటి అంశాలను సభలో ప్రధానంగా లేవనెత్తాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.

ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై విస్తృత చర్చ కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

వివరాలు 

ప్రతిపక్ష పార్టీల్లో చీలికలను అధికార పార్టీ ప్రోత్సహిస్తోంది: ఇండియా కూటమి 

ఇటీవలి కాలంలో పలు రాజకీయ పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలు కొత్త రాజకీయ పార్టీలో చేరడం,మరికొందరు బీజేపీలోకి వెళ్లడం,అలాగే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరడం వంటి పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తూ ప్రతిపక్ష పార్టీల్లో చీలికలను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఈ సమావేశాల్లో కీలక చట్టాలు 

మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాలను ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది.

మంగళవారం ఉదయం పార్లమెంట్‌లో నిర్వహించే ఎన్డీఏ "మంగళ్-మిలన్" సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలను ఉద్దేశించి ప్రభుత్వ అజెండా, శాసన కార్యక్రమాలు, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే కీలక పరిణామాలకు వేదికగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT