Page Loader
ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులు.. మరో ప్లాట్‌ఫామ్‌పై నుంచి జారుకున్న రైలు
మరో ప్లాట్‌ఫామ్‌పై నుంచి జారుకున్న రైలు

ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులు.. మరో ప్లాట్‌ఫామ్‌పై నుంచి జారుకున్న రైలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 26, 2023
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ రైల్వే స్టేషన్ సిబ్బంది అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడంతో వందలాది ప్రయాణికులు ట్రైన్ మిసయ్యారు. కర్ణాటకలోని కలబురగి రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. రైలు ఫ్లాట్ ఫామ్ లో జరిగిన మార్పులను ప్రయాణికులకు చేరవేయడాన్ని అక్కడి సిబ్బంది మర్చిపోయారు. దీంతో ఆ రైలు ఎక్కేందుకు వేచి చూస్తున్న ప్రయాణికులను ఎక్కించుకోకుండానే రైలు వెళ్లిపోయింది. హుబ్బళి - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ నిత్యం కలబురగి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ ఫామ్‌ మీదుగానే వెళ్తుంది. ఎప్పటిలాగే ఈ రైలు ఆదివారమూ సదరు స్టేషన్ ను ఉదయం 6 గంటలకు చేరాలి. తొలుత ఈ రైలు ఉదయం 6.32 గంటలకు కలబురిగికి వస్తుందని డిస్‌ప్లేలో చూపించారు.

DETAILS

రైలు మరో ప్లాట్‌ఫామ్‌ మీదుగా వెళ్లిపోయింది : సిబ్బంది

అనంతరం రైలు 10 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోందని ప్రకటించారు కానీ ప్లాట్‌ఫామ్‌ నంబర్ చూపించలేదు. చివరకు 6.45 గంటలకు డిస్‌ప్లే నుంచి రైలు పేరును తొలగించారు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రయాణికులు ఎంక్వైరీలో సంప్రదించగా కంగుతినే సమాచారం వచ్చింది. సదరు రైలు మరో ప్లాట్‌ఫామ్‌ మీదుగా వెళ్లిపోయిందని బదులిచ్చారు. ఉదయం 6.35 గంటలకే కలబురగికి వచ్చి 6.44 గంటలకు వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో వందలాది ప్రయాణికులు స్టేషన్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు నిర్వహణ తీరుపై మేనేజర్ తో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

DETAILS

టెక్నికల్ ఇష్యుతోనే ప్లాట్‌ ఫామ్‌ నంబర్ మార్పు : స్టేషన్ మేనేజర్

సాంకేతికత కారణాలతోనే రైలు ప్లాట్‌ ఫామ్‌ నంబర్ ను మార్చామని మేనేజర్ వివరించారు. ఈ విషయాన్ని అనౌన్స్ మెంట్ చేయడాన్ని సిబ్బంది మర్చిపోయారన్నారు. దీంతో జరిగిన తప్పిదానికి ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేశారు. ప్రత్యామ్నాయంగా సదరు ప్రయాణికులను హుస్సేన్‌సాగర్‌ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన తమను, రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నాంపల్లి స్టేషన్‌కు చేర్చడంపై ప్యాసింజర్స్ ధ్వజమెత్తారు. అయినప్పటికీ స్టేషన్ కు చాలా ఆలస్యంగానే చేరుకున్నామన్నారు. మరోవైపు ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకున్నా రైల్లో నిలబడే ప్రయాణించాల్సి వచ్చిందని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని సెంట్రల్‌ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.