Passport Rules Changed: పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు.. పిల్లల గడువు, ఫీజులు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
పాస్ పోర్ట్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా 15ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే సాధారణ పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువును పరిమితం చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. ఈ వయసు పిల్లలకు ఇచ్చే పాస్‌పోర్ట్ ఐదేళ్లపాటు లేదా వారికి 18ఏళ్లు నిండే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే,అప్పటివరకు మాత్రమే పాస్‌పోర్ట్ చెల్లుతుంది. 2012 తర్వాత తొలిసారిగా ఫీజుల సవరణ 2012 తర్వాత తొలిసారిగా సాధారణ పాస్‌పోర్ట్ ఫీజులను ప్రభుత్వం సవరించింది. ఈ ఏడాది జులై 1 నుంచి పాస్‌పోర్ట్ దరఖాస్తు రుసుముల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. 18ఏళ్లు పైబడినవారికి 36పేజీల సాధారణ పాస్‌పోర్ట్ కొత్తగా పొందడానికి లేదా రెన్యువల్ చేసుకోవడానికి రూ.2,500 చెల్లించాలి.
వివరాలు
మైనర్లకు వర్తించే ఫీజులు
60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.3,500 రుసుముగా నిర్ణయించారు. తత్కాల్ విధానంలో 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.
18 ఏళ్లలోపు పిల్లలకు 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ను కొత్తగా తీసుకోవడానికి లేదా రెన్యువల్ చేసుకోవడానికి రూ.1,750 రుసుము చెల్లించాలి.
తత్కాల్ విధానంలో ఇదే పాస్‌పోర్ట్‌కు రూ.4,250గా ఫీజు నిర్ణయించారు.
అయితే 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లు పూర్తి పదేళ్ల చెల్లుబాటు గల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే కేటగిరీలోకి వస్తే.. వారికి పెద్దలకు వర్తించే రుసుములే అమలవుతాయి.
వివరాలు
డిస్కౌంట్ యథాతథం
8 ఏళ్లలోపు పిల్లలు, 60ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కొత్త పాస్‌పోర్ట్ కోసం చేసే దరఖాస్తులపై 10 శాతం డిస్కౌంట్ కొనసాగనుంది. అయితే ఈ రాయితీ రెన్యువల్ దరఖాస్తులకు వర్తించదు.
ఇతర పాస్‌పోర్ట్ సేవల రుసుముల్లోనూ మార్పులు
పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా డ్యామేజ్ అయినా దాని స్థానంలో కొత్త పాస్‌పోర్ట్ పొందేందుకు చెల్లించాల్సిన రుసుములను కూడా పెంచారు.
36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000గా ఫీజు నిర్ణయించారు.
పాస్‌పోర్ట్ ఆధారిత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC), సరెండర్ సర్టిఫికెట్ తదితర సేవలకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త రుసుములు, నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక పాస్‌పోర్ట్ వెబ్ పోర్టల్‌లో పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.