LOADING...
Pawan Kalyan: నిరంజన్‌ మృతి కలచివేసింది.. భావోద్వేగంగా స్పందించిన పవన్‌ కళ్యాణ్
నిరంజన్‌ మృతి కలచివేసింది.. భావోద్వేగంగా స్పందించిన పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan: నిరంజన్‌ మృతి కలచివేసింది.. భావోద్వేగంగా స్పందించిన పవన్‌ కళ్యాణ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ అభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్‌ (17) మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్‌ కన్నుమూయగా, ఈ విషాద వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని పవన్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు.

వివరాలు 

"ఆ చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుంది"

కొద్ది రోజుల క్రితం హనుమకొండలోని నిరంజన్‌ ఇంటికి వెళ్లి అతడిని కలిసిన సందర్భాన్ని పవన్‌ తన పోస్టులో గుర్తు చేసుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ తనను చూసేందుకు ఆ చిన్నారి ఎంతో ఆతృతగా ఎదురుచూశాడని తెలిపారు. తనను చూడగానే నిరంజన్‌ ముఖంపై మెరిసిన చిరునవ్వు జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వ్యాధితో శరీరం అలసిపోయినా, మనసులో మాత్రం అపారమైన ధైర్యం, ఆశ, ఆత్మవిశ్వాసం నిండిపోయి ఉండేవని పవన్‌ అన్నారు. అంతటి బాధను భరిస్తూనే జీవితాన్ని ప్రేమించిన నిరంజన్‌ ఇంత చిన్న వయసులోనే దూరమవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి చిరునవ్వు, తనపై చూపిన ప్రేమ ఎప్పటికీ హృదయంలో నిలిచిపోతాయని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్‌ కళ్యాణ్ చేసిన ట్వీట్ 

Advertisement

వివరాలు 

జన్యుపరమైన వ్యాధితో పోరాడిన నిరంజన్

హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్‌ జన్యుపరమైన అరుదైన వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాడు. శారీరక ఎదుగుదల లోపించడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్‌ కల్యాణ్‌ గత నెలలో స్వయంగా అతడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్‌ తుదిశ్వాస విడిచాడు.

Advertisement

వివరాలు 

"ఓజీ-2 కలిసి చూద్దాం" అన్న పవన్‌ మాట నెరవేరకుండానే..

నిరంజన్‌ను కలిసిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ అతడిని ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. అతడితో కలిసి సెల్ఫీ దిగడమే కాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అందించారు. తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్‌ చెప్పగా, "కొని పంపిస్తా చిన్నా" అంటూ హామీ ఇచ్చారు. అదే రోజు కుక్కపిల్లను పంపించి తన మాట నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా, "ఓజీ-2 సినిమా వచ్చినప్పుడు నువ్వే నా స్పెషల్‌ గెస్ట్‌. మనిద్దరం కలిసి సినిమా చూద్దాం" అని పవన్‌ చెప్పిన మాట అభిమానులను అప్పట్లో భావోద్వేగానికి గురి చేసింది. అయితే ఆ కోరిక నెరవేరక ముందే నిరంజన్‌ మృతి చెందడం పవన్‌ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.

వివరాలు 

వీడియో కాల్‌లో పరామర్శించిన సోనూ సూద్

నిరంజన్‌ మృతి విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌ కూడా కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. నిరంజన్‌ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో వారికి అవసరమైన ఏ సహాయమైనా అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement