Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత.. అభిమానుల్లో విషాదం
ఈ వార్తాకథనం ఏంటి
హనుమకొండకు చెందిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు. జన్యుపరమైన వ్యాధితో చిన్నప్పటి నుంచే బాధపడుతున్న అతడు శారీరక ఎదుగుదల లోపంతో మంచానికే పరిమితమయ్యాడు. గత నెలలో నిరంజన్ పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో నిరంజన్‌ను ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. అతనితో సెల్ఫీ దిగడంతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. పవన్ తనను కలవడంతో నిరంజన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల నిరంజన్ ఆరోగ్యం మరింత విషమించడంతో తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
వివరాలు
'ఓజీ 2'లో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అన్న పవన్
అక్కడ చికిత్స కొనసాగుతున్న సమయంలో మంగళవారం రాత్రి అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త తెలిసి పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిరంజన్‌తో జరిగిన ఆత్మీయ సంభాషణలో తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలనే కోరిక ఉందని చెప్పగా, "కొని పంపిస్తా చిన్నా" అంటూ పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అదే రోజు అతడి కోరికను నెరవేర్చుతూ కుక్కపిల్లను పంపించారు. అంతేకాదు, భవిష్యత్తులో 'ఓజీ 2' సినిమా రూపొందితే, "అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్. ఇద్దరం కలిసి సినిమా చూద్దాం" అని పవన్ మాటిచ్చారు. అయితే ఆ కోరిక నెరవేరక ముందే నిరంజన్ మృతి చెందడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.