నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తనను అరెస్ట్ చేసుకోవచ్చని, ఈ మేరకు చిత్రవధ కూడా చేసుకోవచ్చని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్పందించారు. వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో కేసులు పెట్టారని, పవన్ కల్యాణ్ ను విచారించేందుకు జీవో సైతం ఇచ్చారన్నారు. అయితే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడే వాడిని అయితే పార్టీ ఎందుకు పెడతానని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ విషయంపై ఇప్పటికే చర్చించా : పవన్
డేటా దొంగతనం కేసును కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్ అన్నారు. ఇంతకు వాలంటీర్లకు బాస్ ఎవరని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ప్రైవేట్ సంస్థ ఎఫ్‌వోఏ (FOA)కి పంపిణీ చేస్తున్నారన్నారు. అయితే ఏ జీఓ కింద డేటా సేకరణను ప్రైవేటుగా మార్చాలన్నారు. వాలంటీర్లు సేకరించే సమాచారం డేటా ప్రొటెక్షన్ కింద భద్రంగా ఉంటుందన్నారు. కానీ సదరు డేటాను హైదరాబాద్ పరిధిలో ఉండే ఎఫ్‌వోఏ సంస్థకు అందించడాన్ని పవన్ తప్పుబట్టారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ విషయంపై ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని పవన్ హెచ్చరించారు.