పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజున పెట్రోల్ ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ కీలక నివేదిక అందజేసింది. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఒకే చమురు విధానం అంటూ లేదని కేంద్రం గురువారం లోక్‌సభకు నివేదించింది. ఈ మేరకు ఇంధన ధరల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని సదరు మంత్రిత్వశాఖ ప్రకటించింది. రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ మేరకు లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో పెట్రోల్ ధర లీటర్ రూ.109.66, డీజిల్ రూ.97.82 : కేంద్రం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధర లీటర్ రూ.111.87 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.99.61గా ఉందని వెల్లడించారు. ఓ వైపు పెట్రోల్ రేట్లల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్ ఆక్రమించగా, డీజిల్ ధరల్లో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉందన్నారు. డీజిల్ ధరల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. అయితే అమరావతి రాజధానిగా పరిగణిస్తూ కేంద్రం ఇంధన ధరల సేకరణ ప్రక్రియను నిర్వహించింది. మరోవైపు తెలంగాణలో పెట్రోల్ ధర లీటర్ రూ.109.66, డీజిల్ రూ.97.82గా ఉందని వివరించారు. చమురు ధరలు ఆయా రాష్ట్రాల్లో వ్యాట్ పన్నుల ప్రకారమే ఉన్నాయని లోక్‌సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి లిఖితపూర్వకం సమాధానం ఇచ్చారు.