
మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపూర్ కాలిపోతోందన్న నినాదాలతో సభలు దద్దరిలిపోయాయి. ఈశాన్య రాష్ట్రంలో జరిగిన అమానుష ఘటన పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించింది.
ఈశాన్య భారత్ లో కొనసాగుతున్న అల్లర్లు, తాజా పరిస్థితులపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే రెండు సార్లు స్వల్ప వ్యవధిలో సభ వాయిదాలు పడ్డాయి. అయినా సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
అనంతరం రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ స్పందించారు. వారి ప్రవర్తన చూస్తుంటే సభ సజావుగా నడవకూడదనే ఉద్దేశం కనిపిస్తోందని విపక్షాల తీరును తప్పుబట్టారు.
మణిపూర్ ఘటనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సభా వ్యవహారాలను అడ్డుకున్నాయన్నారు.
DETAILS
చర్చకు సమయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు : జోషి
మరోవైపు లోక్‌సభలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే మణిపూర్ కాలిపోతోందంటూ విపక్షాలు గగ్గోలుపెట్టాయి. స్పీకర్ బుజ్జగించినా సభ కుదుటపడలేదు. దీంతో సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించేశారు.
మణిపూర్ దాష్టీకాలపై చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు సహకరించట్లేదని సభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చర్చలు ప్రారంభమైన తర్వాత ఆయా అంశాలపై హోంశాఖ మంత్రి అమిత్ షా వివరిస్తారన్నారు.
అయితే చర్చకు సమయంపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు జోషి తెలిపారు.ఇటీవలే మరణించిన సభ్యులకు తొలుత సంతాపం ప్రకటించిన సభ, తర్వాత మధ్యాహ్నానికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.