మణిపూర్‌లో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు
మణిపూర్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబీకుతోంది. ఈ మేరకు సదరు మహిళలపై ఊరేగింపులో భాగంగా గ్యాంగ్ రేప్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మే 4న మధ్యాహ్నం సుమారు 3 గంటలకు దాదాపు వెయ్యి మంది దుండగులు కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలోకి ఆయుధాలతో చొరబడ్డారు. అనంతరం ఇంట్లోని గృహోపకరణాలు, వంటసామాగ్రి, బట్టలు, పశువులతో సహా దోపిడీ చేశారు. దాడులకు తట్టుకోలేక 56 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మరణించాడని గ్రామపెద్ద సైకుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు ముందు ఇంఫాల్ లోయలో మైతీలు, కొండ ప్రాంతాల్లోని కుకీల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
మహిళలపై అఘాయిత్వాన్ని ఖండించిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్
ఎస్టీ రిజర్వేషన్లపై మైతీ, కుకీ జాతుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఫలితంగా మణిపూర్ అట్టుడికిపోతోంది. మైతీలను ఎస్జీలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయమే హింసకు కారణంగా నిలుస్తోంది. దీన్ని గిరిజన ప్రజలు కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దేరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళలపై దాష్టీకాలను హేయమైన చర్యగా ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF) ఖండించింది. ఈ ఘటన పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులపై ఉక్కుపాదం మోపాలని ఆ రాష్ట్ర సీఎంను కోరారు. ఈశాన్యంలో దాడుల పట్ల (ఇండియా) మౌనంగా ఉండదని రాహుల్ గాంధీ అన్నారు.