నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త కూటములు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్షాలు (ఇండియా) బలాన్ని పెంచుకుంటున్నాయి. ప్రజా సమస్యలపై స్పందించే క్రమంలో కూటములు ఒకరినొకరు ఇరుకునపెట్టుకోనున్నాయి. 2 పక్షాలు వ్యూహాలు, అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చెలరేగుతున్న మణిపూర్ మారణకాండపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా స్పందించలేదు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కామన్ సివిల్ కోడ్ (UCC), దిల్లీ ఆర్డినెన్సు (అత్యవసర ఆదేశం), రైల్వే భద్రత ( ఒడిషా ఘటన), దర్యాప్తు సంస్థల దుర్వినియోగం (IT, CBI,ED),సరిహద్దు స్థితిగతులు చర్చకు రానున్నాయి.
సబ్జెక్టులపై వ్యూహరచనకు రోజూ సమావేశమవ్వాలని విపక్షాల నిర్ణయం
ధరల పెరుగుదల, మహిళా రిజర్వేషన్లు, ద్రవ్యోల్బణంపైనా చర్చలు జరగనున్నాయి. ఆయా సబ్జెక్టులపై వ్యూహరచనకు రోజూ సమావేశమవ్వాలని విపక్ష కూటమి నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. మొత్తం 17 పని దినాల్లో 32 అంశాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. మొదటి రోజు తొలి సెషన్ ప్రారంభం నుంచే ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు విపక్షాలు సర్వసన్నద్ధమయ్యాయి. మరోవైపు దిల్లీ ఆర్డినెన్సును కాంగ్రెస్, TMC, DMK వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సమర్పించిన నోటీసులను లోక్‌సభ సెక్రటేరియట్ అనుమతించింది. ఇండియా కూటమి గురువారం మొదటిసారి సమావేశం అవుతోంది. ఉభయసభల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ముందస్తు సన్నద్ధత కోసం రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఏర్పాటు చేయనున్నారు.
అఖిలపక్ష భేటీకి 34 పార్టీల తరఫున ప్రతినిధులు హాజరు
మరోవైపు విపక్షాలు లేవనెత్తే ఏ అంశంపై అయినా చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలను ఆటంకాలు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో బుధవారం సాయంత్రం అఖిలపక్ష భేటీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు 34 పార్టీల తరఫున ప్రతినిధులు హాజరై డిమాండ్లను స్పష్టం చేశారు. మణిపూర్ హింసపై తొలిరోజే ప్రధాని మాట్లాడాలని పట్టుబట్టారు. పలు పార్టీలు కుల గణన, నిరుద్యోగం అంశాలపై చర్చ జరగాలని ప్రతిపాదించాయి. అన్నింటిపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు సభ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారమే పేర్కొన్నారు. స్పీకర్ షెడ్యూల్ నిర్ణయం మేరకే మణిపూర్ రగడపై చర్చిస్తామని జోషి అన్నారు.
తొలి రోజే మణిపూర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామన్న కాంగ్రెస్
అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజే మణిపూర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని తేల్చి చెప్పింది. దిల్లీ ఆర్డినెన్సులను సైతం వ్యతిరేకిస్తామని చెప్పింది. ప్రధాని ప్రకటనకు విపక్షాలు డిమాండ్ చేయడం అంటే సభలో గందరగోళ సృష్టికి ఒక సాకుగా జోషి అభివర్ణించారు. గత ప్రధానులు పీవీ, వాజ్‌పేయీ, మన్మోహన్ హయాల్లో ఏ అంశంపైనైనా చర్చలు నిరంతరంగా సాగేవని విపక్షాలు గుర్తు చేశాయి. తెలుగు రాష్ట్రాల పార్టీలు భారాస, వైకాపాలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అభ్యర్థించాయి. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా బుధవారం ఆయా పార్టీల లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. సభ సక్రమంగా సాగేందుకు సహకరించాలన్నారు.