రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు సభలో అనుసరించాల్సిన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. సమస్యాత్మకంగా మారిన మణిపూర్ హింసాకాండను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వర్షాకాల సమావేశానికి ముందు జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో జోషి మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. హింస కారణంగా మణిపూర్‌లో సుమారు 80 మందికిపైగా ప్రజలు మరణించారని ఆయన తెలిపారు.సదరు హింసాకాండ సహా ఏ విషయమైనా సభలో చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.
నరేంద్ర మోదీ స్పందించాలని విపక్షాల డిమాండ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ హింస సహా వస్తువుల ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థలు (CBI, IT, ED)ల దుర్వినియోగం, రెజర్ల ఆందోళన (బ్రిజ్ భూషన్ అంశం) వంటి విషయాలపై కేంద్రాన్ని కడిగేయాలని ప్రతిపక్షాలు అస్త్రాలు రెడీ చేస్తున్నాయి. మరోవైపు మణిపూర్ హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ కాలిపోయింది, ఈయూ పార్లమెంట్ భారతదేశ అంతర్గత విషయంపై చర్చిస్తోంది. ప్రధాని మోదీ ఒక్క మాట అయినా మాట్లాడలేదు అని చురకలు అంటించారు. ఇంతలో బాస్టిల్ డే పరేడ్‌కు టిక్కెట్‌ను పొందాడని రాహుల్ ట్వీట్ల వర్షం కురిపించారు.