
Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం(జూలై 20) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కోరే అవకాశం ఉంది.
అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు.
వాస్తవానికి రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్కర్ మంగళవారం ఎగువసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బెంగుళూరులో ప్రతిపక్షాలు సమావేశం, దిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నేపథ్యంలో అయితే చాలా మంది హాజరు కాలేదు. దీంతో సమావేశం వాయిదా పడింది.
దిల్లీ
ఎన్నికల వేళ రసవత్తరంగా మారనున్న వర్షాకాల సమావేశాలు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన కేబినెట్ సహచరులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌లతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరు అఖిలపక్ష సమావేశంలో చర్చించే పాయింట్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గోయల్ రాజ్యసభలో సభా నాయకుడిగా ఉండగా, జోషి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంట్ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
ముఖ్యంగా దిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం రెండు సభల్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.