Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం: హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పొరుగుదేశం బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ వ్యవహారాల్లో దౌత్య మార్గాలు తేడా చూపకపోవడంతో, ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో చేశారు. "వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'చికెన్స్ నెక్' (Chicken's Neck) ప్రాంతంపై ఉన్న ఆందోళన స్వభావసిద్ధం. దౌత్యం లేదా ఇతర మార్గాల ద్వారా 20-22 కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కాపాడుకోవాలి. ఔషధపరమైన చర్యలు విఫలమైతే, శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది"హిమంత బిశ్వశర్మ అన్నారు.
వివరాలు
సముద్రానికి రక్షకులుగా భారత్
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనా పర్యటన సమయంలో 'చికెన్స్ నెక్' గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. "భారత ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలను 'సెవెన్ సిస్టర్స్' అని పిలుస్తారు. ఇవి బంగ్లాదేశ్ భూపరివేష్టిత ప్రాంతాలతో కలిపి ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి రక్షకులుగా భారత్ మాత్రమే ఉంది. కాబట్టి, ఇది చైనాకు ఆర్థిక వృద్ధి కోసం ఒక పెద్ద అవకాశం"అని నోరు పారేసుకున్నారు.
వివరాలు
చైనా అధీనంలోని చుంబీ ప్రాంతానికి కూడా ఇది అత్యంత సమీపంలో ఉంది
'చికెన్స్ నెక్' కారిడార్ పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలో ఉంది. ఇది '7 సిస్టర్స్'గా పిలిచే ఈశాన్య రాష్ట్రాల.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం,మణిపుర్,మేఘాలయ,మిజోరం,నాగాలాండ్, త్రిపురను భారత ప్రధాన భూభాగంతో కలుపుతుంది. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు కలిగినది. అలాగే, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు అత్యంత దగ్గరగా ఉంది. చైనా అధీనంలోని చుంబీ ప్రాంతానికి కూడా ఇది అత్యంత సమీపంలో ఉంది. సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నట్లు, ఈ ప్రాంతంపై దాడి జరిగితే, భారత ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉంది.
వివరాలు
చైనా ఈ ప్రాంతం తనదేనని వాదిస్తూ వస్తోంది
అటువంటి పరిస్థితి జరిగితే,ఈశాన్యంలోని సైనిక దళాలకు సరఫరా నిలిపివేయబడే అవకాశం ఉంది. ఇక డోక్లాం (Bhutanలో)ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ ఆడ్డుకోవడానికి ప్రధాన కారణాల్లో ఇదే ఉంది. చైనా ఈ ప్రాంతం తనదేనని వాదిస్తూ వస్తోంది. 2017లో భారత్-చైనా మధ్య ఈ విషయంలో 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొన్నది.