LOADING...
Medaram: మేడారంలో ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు.. రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు
రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు

Medaram: మేడారంలో ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు.. రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలతో కొత్త రూపంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న ఈ జాతరకు తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుండి కోటి మందికి పైగా భక్తులు వచ్చి సందర్శిస్తారని అంచనా. ఈ సారి,సాధారణ తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పుడు లేని విధంగా, రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వనదేవతల గద్దెల విస్తరణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ పనులకు రూ.101 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.

వివరాలు 

పునర్నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. 

గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా బలంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 స్తంభాల ద్వారా 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాంగణం రూపకల్పన చేయబడింది. మధ్యలో 40 అడుగుల వెడల్పుతో మూడు స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణానికి ఎదురుగా 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క-సారలమ్మ గద్దెల వరుసలోకి మార్చి, భక్తులు ఒక వరుసలో దర్శనం పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. వృత్తాకారంలో ఉన్న గద్దె చుట్టూ 8 స్తంభాలను, మధ్యలో వెదురు బొంగులతో అలంకరించారు.

వివరాలు 

శిలలపై ఆదివాసీల సంస్కృతి 

తాళపత్రాలపై కోయ వంశీయుల చరిత్రను గోడలపై బొమ్మలు, చిహ్నాలుగా చెక్కిస్తున్నారు. దీనికి అవసరమైన తెలుపు రాళ్లను ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించి, శిల్పులచే చెక్కించి మేడారానికి తీసుకొచ్చారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్రను సూచించే 59 బొమ్మలు ఉన్నాయి. సమ్మక్క వంశానికి చెందిన రాయి బందానీ 5వ గొట్టు, వారి ఇంటి దైవానికి ప్రత్యేక కొమ్మును రెండు వైపులా అడవి దున్న కొమ్ములు,నెమలి ఈకలతో తోరణం అగ్రభాగంలో చెక్కారు. మిగతా శిలలపై 3-7 గొట్టుల వంశీయుల చరిత్ర,వారు పూజించిన జంతువులు, జీవనశైలిని ప్రతిబింబించే బొమ్మలు ఉన్నాయి. మొత్తం దాదాపు 750 మంది కోయ వంశీయుల జీవితాలను సూచించే 7,000 బొమ్మలు ఉంటాయని తెలిపారు.

Advertisement

వివరాలు 

శిలలపై ఆదివాసీల సంస్కృతి 

డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు పనిచేశారు. స్థపతులు శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 15 మంది విద్యార్థులు చిత్రాల రూపకల్పనలో సహకరించారు. డాక్టర్ మైపతి అరుణ్ ప్రకారం, ఇది వారి 15 ఏళ్ల శ్రమ ఫలితం. గద్దెల ప్రాంగణానికి సమీపంలోని చెట్లు దాదాపు తొలగించకుండా అభివృద్ధి పనులు చేపట్టారు. పునర్నిర్మాణం తర్వాత, బండారి, మర్రి, వెదురు, బూరుగ, వేప, ఇప్ప, కస్తు వంటి 12 రకాల చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కలను నాటనున్నారు. మేడారం చేరుకునే మార్గంలోని సడలని రోడ్లు, వంతెనలను విస్తరించారు. గ్రామాల్లో ఉన్న రెండు లేన్ రోడ్లను నాలుగు లేన్‌గా మార్చారు.

Advertisement

వివరాలు 

మంత్రుల నిరంతర పర్యవేక్షణ 

స్థానికంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించారు. జంపన్న వాగుకు వెళ్లే మార్గాలను అభివృద్ధి చేసి వాగు ఒడ్డును సుందరంగా తీర్చిదిద్దారు. నిరంతర విద్యుత్తు కోసం అదనపు సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణం బయట క్యూలైన్‌లను, వాటిపై రేకులు తో పైకప్పును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతల ప్రకారం, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరచూ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. మంత్రులు సీతక్క, సురేఖ కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement