LOADING...
Vehicle Registration: రవాణా కార్యాలయాల చుట్టూ తిరుగుడుకు చెక్‌.. షోరూంలోనే శాశ్వత వాహన రిజిస్ట్రేషన్
షోరూంలోనే శాశ్వత వాహన రిజిస్ట్రేషన్

Vehicle Registration: రవాణా కార్యాలయాల చుట్టూ తిరుగుడుకు చెక్‌.. షోరూంలోనే శాశ్వత వాహన రిజిస్ట్రేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమలులోకి వచ్చింది. నిజామాబాద్‌ జిల్లాలో వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేరుగా షోరూంల్లోనే నిర్వహించే ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్‌ను కూడా పూర్తిచేయాల్సిన బాధ్యతను రాష్ట్ర రవాణాశాఖ వాహన షోరూంల నిర్వాహకులకు అప్పగించింది. ఈ విధానం ఇటీవల జిల్లాలో ప్రారంభమైనప్పటికీ, ప్రారంభ దశలో సాఫ్ట్‌వేర్‌పై షోరూంల సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం,కొన్ని అంశాల్లో అధికారులకూ స్పష్టత లేకపోవడం వల్ల సేవల్లో ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం అన్ని సందేహాలకు పరిష్కారం లభించడంతో వ్యక్తిగత వినియోగానికి చెందిన ద్విచక్ర వాహనాలు,కార్లకు షోరూంల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.

వివరాలు 

ట్రాన్స్‌పోర్టు వాహనాల కోసం ఆర్టీఏ ఆఫీసి కి వెళ్ళాలి 

అయితే ట్రాన్స్‌పోర్టు వాహనాల విషయంలో మాత్రం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏజెంట్ల జోక్యం లేకుండా, వాహనం కొనుగోలు చేసిన చోటే అన్ని సేవలు అందుతుండటంతో వాహనదారులపై అదనపు భారం తగ్గుతోంది. ఈ నూతన విధానం ప్రకారం, వినియోగదారులు వాహనం కొనుగోలు చేసిన అనంతరం షోరూంలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరును నమోదు చేస్తారు. తదుపరి దశలో రవాణా శాఖ పోర్టల్‌లోకి లాగిన్ అయి టీఆర్ సంఖ్య, ఇన్‌వాయిస్, ఛాసిస్ నంబరు, వాహన ఫోటో,బీమా పత్రాలు, దరఖాస్తు వివరాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేస్తారు.

వివరాలు 

ఆర్సీ కార్డును స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపుతారు 

ఆ తర్వాత వాహనానికి సంబంధించిన అసలు పత్రాలను రవాణా శాఖ కార్యాలయానికి పంపిస్తారు. వాటిని అధికారులు పరిశీలించిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) సిద్ధమైన వెంటనే ఆ సమాచారం వాహనదారుడి మొబైల్ ఫోన్‌కు చేరుతుంది. అనంతరం ఆర్సీ కార్డును స్పీడ్‌పోస్ట్ ద్వారా వారి చిరునామాకు పంపిస్తారు. జిల్లాలో మొత్తం 105 వరకు వాహన విక్రయ షోరూంలు ఉండగా, వీటిలో రోజుకు సగటున 90 వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ అవుతున్నట్లు సమాచారం.

Advertisement