Shambhu Border: శంభు సరిహద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
శంభు సరిహద్దు మూసివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. పంటలకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ, హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీ చలో ఉద్యమాన్ని ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అప్రమత్తమైన పోలీసులు శంభు సరిహద్దు హైవేలను నిర్బందించి, రాకపోకల్ని నిలిపివేశారు.
హైవేలను దిగ్బంధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్
ఈ హైవే నిర్బంధం, రైతుల ఢిల్లీ చలో కార్యక్రమంపై పంజాబ్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో శంభు సరిహద్దు సహా హైవేలను తిరిగి తెరవాలని, రైతులను హైవే మీదుగా తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సూచించాలంటూ పేర్కొన్నారు. అయితే, శాంతిభద్రతలను కాపాడుతూ నిరసన తెలియజేయడానికి రైతులపై కోర్టు ఆదేశాలు జారీ చేయాలని, హైవేలను అడ్డుకోవడం ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా జాతీయ రహదారి చట్టం ప్రకారం నేరమని, హైవేలను దిగ్బంధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు.