Loading...
LPG crisis : పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులోనే.. ఎల్‌పీజీ సిలిండర్లకే క్యూలు ఎందుకు?
పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులోనే.. ఎల్‌పీజీ సిలిండర్లకే క్యూలు ఎందుకు?

LPG crisis : పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులోనే.. ఎల్‌పీజీ సిలిండర్లకే క్యూలు ఎందుకు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌ ఇంధన సరఫరాపై పడుతోంది. యూఎస్‌-ఇజ్రాయెల్ సంయుక్త‌ దాడులతో ఇరాన్‌ పై యుద్ధ పరిస్థితులు ఏర్పడిన తర్వాత దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. అయితే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా మాత్రం ఇప్పటివరకు సాధారణంగానే కొనసాగుతోంది. ఈ వ్యత్యాసానికి కారణాలు ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Details

దేశవ్యాప్తంగా ఎల్పీజీ కోసం క్యూలు

మార్చి 9 నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో గ్యాస్‌ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి.

కొన్ని చోట్ల రెస్టారెంట్లు, ఢాబాలు తాత్కాలికంగా మూతపడగా, గృహ వినియోగదారులు రీఫిల్‌ కోసం రోజులు వేచి చూడాల్సి వస్తోంది.

దీనికి ప్రధాన కారణం ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం.

పర్షియన్‌ గల్ఫ్‌లోని ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, వాయువు సరఫరాలో పెద్ద భాగం రవాణా అవుతుంది.

ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ మార్గంలో నౌకా రాకపోకలు దెబ్బతినడంతో భారత్‌కు వచ్చే ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడుతోంది.

Details

పెట్రోల్‌, డీజిల్‌పై వెంటనే ప్రభావం ఎందుకు లేదు?

కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేస్తోంది.

ఎల్పీజీ విషయంలో కూడా సరఫరా నిలిచిపోదని చెబుతున్నప్పటికీ, మార్కెట్‌లో ఏర్పడిన భయాందోళనల వల్ల డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిందని పేర్కొంది.

దీనిని "డిమాండ్‌ ఆధారిత అసమతుల్యత"గా కేంద్రం అభివర్ణించింది.

గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడానికి కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాన్ని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా నిలిపివేశారు.

దీంతో బ్లాక్‌మార్కెట్‌లో ధరలు పెరగడంతో అనేక హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేశాయి.

ADVERTISEMENT

Details

హార్ముజ్‌ మార్గం భారత్‌కు ఎందుకు కీలకం?

భారత్‌ ప్రతి సంవత్సరం సుమారు 31 మిలియన్‌ టన్నుల ఎల్పీజీ వినియోగిస్తుంది.

ఇందులో సగానికి తక్కువ మాత్రమే దేశీయ ఉత్పత్తి ద్వారా లభిస్తుంది. మిగిలిన భాగం గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి అవుతుంది.

ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి దేశాల నుంచి భారీగా ఎల్పీజీ దిగుమతి అవుతుంది.

మీడియా అంచనాల ప్రకారం భారత్‌కు వచ్చే ఎల్పీజీ కార్గోల్లో దాదాపు 80-90 శాతం హార్ముజ్ జ‌ల‌సంధిమార్గం ద్వారానే వస్తాయి.

అందుకే ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే మొదట ప్రభావం ఎల్పీజీపై పడుతుంది.

ADVERTISEMENT

Details

క్రూడ్‌ ఆయిల్‌ సరఫరా విస్తృతంగా ఉండటం వల్ల ఉపశమనం

పెట్రోల్‌, డీజిల్‌ మాత్రం క్రూడ్‌ ఆయిల్‌ నుంచి తయారవుతాయి. భారత్‌ క్రూడ్‌ ఆయిల్‌ను 40కు పైగా దేశాల నుంచి దిగుమతి చేస్తోంది.

ఇటీవల సంవత్సరాల్లో ర‌ష్యా అతిపెద్ద సరఫరాదారుగా మారగా, తరువాత ఇరాక్‌, సౌదీ అరేబియా ఉన్నాయి.

పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకారం ప్రస్తుతం భారత్‌కు వచ్చే క్రూడ్‌ ఆయిల్‌లో సుమారు 70 శాతం హార్ముజ్ జలసంధి మార్గాన్ని దాటకుండా ఇతర మార్గాల ద్వారా వస్తోంది.

అదనంగా భారత్‌కు అధిక రిఫైనింగ్‌ సామర్థ్యం ఉండటంతో అవసరాన్ని బట్టి ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.

Details

వ్యూహాత్మక నిల్వలు కూడా కారణం

భారత్‌ అత్యవసర పరిస్థితుల కోసం భారీ క్రూడ్‌ ఆయిల్‌ నిల్వలను కూడా ఉంచుతుంది.

విశాఖపట్నం, మంగళూరు, పాడూరు ప్రాంతాల్లో భూగర్భ గుహల్లో ఈ నిల్వలు ఉంచుతారు.

ఇవి కొన్ని వారాల పాటు దేశ అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగి ఉంటాయి.

అందువల్ల పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వెంటనే ప్రభావం కనిపించదు.

Details

ఎల్పీజీ ఎందుకు ఎక్కువగా ప్రభావితమవుతోంది?

క్రూడ్‌ ఆయిల్‌తో పోలిస్తే ఎల్పీజీ నిల్వ సామర్థ్యం భారత్‌లో చాలా తక్కువ.

దేశంలో ఉన్న ఎల్పీజీ గుహల మొత్తం నిల్వ సామర్థ్యం కేవలం 1.4 లక్షల టన్నులు మాత్రమే.

ఇది దేశ వినియోగానికి రెండు రోజులకంటే తక్కువ సమానమని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదికలు చెబుతున్నాయి.

అదనంగా భారత్‌లో గ్యాస్‌ నిల్వల కోసం పెద్ద భూగర్భ సదుపాయాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు.

గ్యాస్‌ సరఫరా వ్యవస్థ ఎక్కువగా నిరంతర ప్రవాహంపై ఆధారపడుతుంది.

Details

ఉజ్వల పథకం తర్వాత పెరిగిన డిమాండ్

గత దశాబ్దంలో ఎల్పీజీ వినియోగం గణనీయంగా పెరిగింది.

ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా గ్రామీణ కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు అందించడంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 33 కోట్లకు చేరాయి.

2016లో ఈ పథకం ప్రారంభమైనప్పుడు సుమారు 16.6 కోట్ల కనెక్షన్లు ఉండగా, 2025 నాటికి అవి దాదాపు రెట్టింపయ్యాయి.

Details

పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలు

ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాను స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపడుతోంది.

రిఫైనరీలను క్రూడ్‌ ప్రాసెసింగ్‌ నుంచి ఎక్కువ ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని ఆదేశించారు.

అదనంగా యూఎస్, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి కూడా అదనపు ఎల్పీజీ కార్గోలు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆ సరుకులు భారత్‌కు చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

అందుకే ప్రస్తుతం గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తూ సరఫరా నిర్వహిస్తున్నారు.

మొత్తంగా చూస్తే ఎల్పీజీ దిగుమతులు ఎక్కువగా గల్ఫ్‌ ప్రాంతంపైనే ఆధారపడటం,నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఈ ఇంధనం ముందుగా ప్రభావితమైంది.

పెట్రోల్‌, డీజిల్‌ మాత్రం విస్తృతంగా దిగుమతులు చేయడం, పెద్ద నిల్వలు ఉండడం వల్ల తక్షణ ప్రభావం నుంచి బయటపడ్డాయి.

ADVERTISEMENT