ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే?
దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తాను అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ ధరను నిర్ణయించింది. సింగిల్ డోసు ధర రూ. 800గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనికి పన్నులు అదనం అని తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారీ మొత్తంలో కొనుగోలు చేసే వారికి డోసును రూ. 320కే విక్రయించనున్నట్లు భారత్ బయోటెక్ వివరించింది. 'ఇంకోవాక్' పేరుతో ఈ నాసల్ టీకాను అభివృద్ధి చేసింది. కోవిన్ పోర్టల్‌లో కూడా 'ఇంకోవాక్' పేరుతో అందుబాటులో ఉంటుందని చెప్పింది. జనవరి నాలుగో వారం నుంచి నాసల్ వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని భారత్ బయోటెక్ పేర్కొంది.
18ఏళ్ల పై బడిన వారికి..
భారత్‌లో బూస్టర్ డోసును మరింత సలభతరం చేసేందుకు వీలుగా.. ఈ నాసల్ వ్యాక్సిన్‌ను రూపొందించారు. భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సినే.. ఇండియాలో మొదటి సూది రహిత బూస్టర్ డోస్ టీకాగా గుర్తింపు పొందింది. 18ఏళ్ల పై బడిన వారు ఈ టీకాను తీసుకోవచ్చు. వ్యాక్సిన్ ధరను త్వరలో నిర్ణయించి.. ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. నాసికా వ్యాక్సిన్లు ప్రస్తుతం చాలా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నాజల్ వ్యాక్సిన్‌ను ముక్కుద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీకా వైరస్ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగిస్తుంది. తద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుతుంది.