Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. నిందితుల జాబితాలో ముగ్గురు భారాస నేతల పేర్లు ?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో ముగ్గురు భారాస ముఖ్య నేతలను నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుదీర్ఘంగా నిర్వహించిన విచారణ ఇటీవల ముగియగా,అనుబంధ అభియోగపత్రంలో వారి పేర్లను చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం న్యాయ నిపుణుల పరిశీలన పూర్తైన తర్వాత, వీరిపై అభియోగాలు నమోదు చేసేందుకు అవసరమైన సాంకేతిక అనుమతులు కూడా పొందనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కేసులో కొత్త నిందితులను చేర్చాల్సి వస్తే కోర్టులో ప్రత్యేకంగా మెమో దాఖలు చేస్తారు. అయితే ఈ కేసులో సిట్ ముందస్తు జాగ్రత్తగా అనుబంధ అభియోగపత్రంతో పాటు మెమోను కూడా ఒకేసారి దాఖలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఉన్నతాధికారుల వాంగ్మూలాలతో కీలక ఆధారాలు
ఈ ముగ్గురు నేతలను నిందితులుగా చేర్చే ప్రక్రియలో సిట్ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా వందలాది మంది నుంచి వాంగ్మూలాలు సేకరించిన అధికారులు, కీలక సాక్ష్యాధారాలను పరిశీలించినట్లు సమాచారం. ప్రత్యేకంగా 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. ఆ 15 రోజుల వ్యవధిలో మొత్తం 4,013మందిపై నిఘా కొనసాగించినట్లు దర్యాప్తులో గుర్తించారు. వీరిలో 618 మంది ఫోన్ సంభాషణలను అక్రమంగా విన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ వివరాల ఆధారంగా కేసు ప్రధాన నిందితుడు,ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావును సిట్ విచారించింది.
వివరాలు
మాజీ ఉన్నతాధికారుల వాంగ్మూలాలపై ప్రత్యేక దృష్టి
విచారణలో ఆయన పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను వ్యవహరించానని, వారి సూచనల ప్రకారమే చర్యలు తీసుకున్నానని వెల్లడించినట్లు సమాచారం. దర్యాప్తును తుది దశకు తీసుకెళ్లే క్రమంలో ఓ మాజీ డీజీపీతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిఘా విభాగంలో పనిచేసిన ఓ సీనియర్ అధికారిని కూడా సిట్ ఇటీవల విచారించినట్లు తెలిసింది. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో), హోంశాఖలో పనిచేసిన పలువురు ఉన్నతాధికారుల నుంచి కూడా వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సమాచారం. సేకరించిన అన్ని ఆధారాలు, వాంగ్మూలాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ముగ్గురు భారాస నేతలను నిందితులుగా చేర్చుతూ అనుబంధ అభియోగపత్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఒక్కొక్కరి పాత్రపై ఆధారాలు.. ఒకరికి మినహాయింపు
అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ముగ్గురు నేతల పాత్రను సిట్ అనుబంధ అభియోగపత్రంలో వివరంగా నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్‌ఐబీ మాజీఅధికారి ప్రభాకర్‌రావు నియామకం వెనుక ఉన్న పరిస్థితులపై మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేసిన దర్యాప్తు అధికారులు,ఆ కోణంలో విచారణ జరిపి వారిలో ఓ ప్రముఖనేత పాత్రకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే భారాసకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో మరో నేత పాత్రపై,ఎవరిపై అక్రమ నిఘా ఉంచాలనే అంశంలో ఆదేశాలు ఇచ్చిన వ్యక్తిగా ఇంకొక నేతపై కూడా సాక్ష్యాధారాలు లభించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా,ఈకేసులో మరో కీలక మాజీ ప్రజాప్రతినిధిని గతంలో సిట్ విచారించినప్పటికీ, ఆయన పేరును మాత్రం అనుబంధ అభియోగపత్రంలో చేర్చలేదని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి.