Hyderabad: హైదరాబాద్‌లో పికో జీసీసీ.. ఐటీ రంగానికి మరో బూస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన పికో టెక్నాలజీ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. శనివారం సచివాలయంలో పికో టెక్నాలజీ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక సంస్థలు తమ జీసీసీల స్థాపన కోసం హైదరాబాద్‌ను ప్రాధాన్య గమ్యస్థానంగా ఎంపిక చేసుకుంటున్నాయని తెలిపారు. నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులు, మెరుగైన రవాణా వ్యవస్థ, తక్కువ ఖర్చుతో లభించే అద్దె సదుపాయాలు వంటి అంశాలు నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయని వివరించారు.
వివరాలు
ట్రాఫిక్ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాం
ఇక రవాణా మౌలిక వసతుల అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రధాన నగరాలకు మించి హైదరాబాద్‌లో ట్రాఫిక్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం జరుగుతోందని, దీనికి అనుబంధంగా రేడియల్ రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హయత్‌నగర్-ఎల్‌బీనగర్ మధ్య డబుల్ డెక్కర్ రోడ్ల నిర్మాణం చేపడతామని, నాగ్‌పుర్ తర్వాత ఇలాంటి రహదారులు నిర్మిస్తున్న నగరం హైదరాబాద్‌నే అవుతుందని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.
వివరాలు
గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
ఈ సమావేశంలో పికో టెక్నాలజీ వ్యవస్థాపక సీఈవో జారోడ్ యూస్టర్, పికో ఇండియా సీఈవో హరికోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కే పరిమితం కాకుండా, విడిభాగాల తయారీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు సమగ్ర ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్‌కు చెందిన 'రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ 10 మిలియన్ టీవీ యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేసిన సందర్భంగా, సంస్థ ప్రతినిధులను మంత్రి సచివాలయంలో అభినందించి సంస్థ ఫ్లెక్సీని ఆవిష్కరించారు.