Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం కోర్టు ఎదుట హాజరయ్యారు. పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారు స్వయంగా చేరుకొని లొంగిపోయారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెదేపా నాయకులు, సహోదరులు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు,జవ్విశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలచుకొని ఈ జంట హత్యలకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలతో పోలీసులు పిన్నెల్లి సోదరులను కేసులో ఏ-6, ఏ-7 నిందితులుగా చేర్చారు.
వివరాలు
సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ రద్దు
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్‌ను మొదట కింది కోర్టు, అనంతరం హైకోర్టు కూడా తిరస్కరించాయి. దీంతో వారు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దయింది. రెండు వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించడంతో, ఆ ఆదేశాల మేరకు ఈరోజు పిన్నెల్లి సోదరులు కోర్టు ముందు లొంగిపోయారు.