
Piyush Goyal:చిప్స్,ఐస్‌క్రీమ్‌ల దగ్గరే ఆగిపోకూడదు..భారత స్టార్టప్‌లపై కీలక వ్యాఖ్యలు చేసిన పియూష్ గోయల్ .. స్పందించిన క్విక్ కామర్స్ సంస్థలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ భారత స్టార్టప్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని అనేక స్టార్టప్‌లు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి రంగాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని పేర్కొన్నారు.
అయితే, చైనా స్టార్టప్‌లు మాత్రం భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.
''ప్రస్తుతం మన దేశంలోని స్టార్టప్‌ల పరిస్థితిని పరిశీలిస్తే,మనం ఫుడ్ డెలివరీ యాప్‌లపై అధికంగా దృష్టి కేంద్రీకరించాం.
దీని వల్ల దిగువ తరగతి కార్మికులు పని చేసేందుకు అవకాశాలు లభిస్తున్నాయి, కానీ సంపన్నులు ఇంట్లోనే కూర్చొని సౌకర్యంగా ఆహారం పొందుతున్నారు.
ఇదే సమయంలో,చైనా స్టార్టప్‌లు కృత్రిమ మేధస్సు (AI),ఎలక్ట్రిక్ వాహనాలు (EVs),సెమీ కండక్టర్లు వంటి ఆధునిక రంగాల్లో ముందంజ వేస్తున్నాయి.
వివరాలు
డెలివరీ బాయ్స్ లేదా గర్ల్స్‌గా మాత్రమే మిగిలిపోదామా?
భారతదేశంలో డీప్-టెక్ స్టార్టప్‌లు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తం 1,000 స్టార్టప్‌లు మాత్రమే ఈ రంగంలో పని చేయడం ఆందోళనకరమైన విషయం.
భారత యువత తమ గొప్ప ఆలోచనలను రూ.25 లక్షలు, రూ.50 లక్షలకు విదేశీ సంస్థలకు విక్రయిస్తున్నారు.
కొత్తగా వస్తున్న స్టార్టప్‌లు భవిష్యత్ తరాల కోసం దేశాన్ని సిద్ధం చేయాలి. మనం ఐస్‌క్రీం, చిప్స్ అమ్మడం దగ్గరే ఆగిపోకూడదు.
డెలివరీ బాయ్స్ లేదా గర్ల్స్‌గా మాత్రమే మిగిలిపోదామా? అదే మన లక్ష్యమా? ఇది స్టార్టప్‌ల అసలు ఉద్దేశం కాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
విమర్శించడం తేలిక: జెప్టో సీఈఓ
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై క్విక్ కామర్స్ సంస్థ జెప్టో సీఈఓ అదిత్ పలిచా స్పందించారు.
''విమర్శించడం తేలిక'' అంటూ గోయల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
''యూఎస్, చైనా వంటి దేశాల్లోని డీప్-టెక్ నైపుణ్యాన్ని భారతదేశంలోని కన్జ్యూమర్ ఇంటర్నెట్ స్టార్టప్‌లతో పోల్చి విమర్శించడం చాలా తేలిక. ప్రస్తుతం జెప్టో సంస్థలో 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. 3.5 సంవత్సరాల క్రితం ఈ సంస్థ అసలే లేదు. మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. దేశానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాం. సరఫరా గొలుసు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వందల కోట్ల పెట్టుబడులు పెట్టాం. ''ఈ అభివృద్ధి అద్భుతం కాకపోతే.. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు!''
వివరాలు
భారత్‌కు భారీస్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదు..?
భారతదేశంలో పెద్ద ఏఐ మోడల్ లేకపోవడానికి కారణం ''అమెజాన్, ఫేస్‌బుక్, అలీబాబా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ లేవు.అవి కూడా కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీలుగా మొదలై, తరువాత ఏఐ ఆవిష్కరణలను అభివృద్ధి చేశాయి.ఈ కంపెనీల వద్ద విస్తృత డేటా, ప్రతిభావంతులైన నిపుణులు, పెట్టుబడులు ఉన్నాయి.అందుకే అవి ప్రపంచ స్థాయిలో ఎదిగాయి. స్టార్టప్ ఎకోసిస్టమ్, ప్రభుత్వం, పెట్టుబడిదారులు భారతీయ స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వాలి. ఎదుగుతున్న సంస్థలను అణచివేయకూడదు'' అని పలిచా తెలిపారు.
వివరాలు
భారత స్టార్టప్‌లను తక్కువగా చూడొద్దు
డీప్-టెక్ సంస్థల అభివృద్ధికి భారత ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇస్తోంది? అని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ ప్రశ్నించారు.
భారత స్టార్టప్‌లను తక్కువగా అంచనా వేయకూడదని, భారత ప్రభుత్వం నిజమైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.