Page Loader
AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నం సమీపంలోని డీఎల్‌పురం వద్ద మెస్‌ర్స్ ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్‌ రూ.1,35,000కోట్ల పెట్టుబడితో నిర్మించే 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు కర్మాగారానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మించనున్నారు. ఈ ఉక్కు పరిశ్రమ అవసరాల కోసం 2.9 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్ కలిగిన కేప్టివ్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. కాకినాడ గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్ పోర్టుతో కుదిరిన ఒప్పందంలోని కొన్ని నిబంధనలను సవరించారు. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

Details

ఉపాధి కల్పనపై దృష్టి 

నిప్పాన్ ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టు మొదటి దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడితో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని 2029 జనవరిలో పూర్తి చేస్తారు. దీని ద్వారా 20,000 మందికి ఉపాధి లభించనుంది. ఇదే సమయంలో రూ.5,816 కోట్ల వ్యయంతో 20.5 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా సామర్థ్యం కలిగిన కేప్టివ్ పోర్టు తొలి దశ పూర్తవుతుంది. దీని వల్ల 1,000 మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో రూ.80,000 కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారం 2033 నాటికి పూర్తవుతుంది. దీని ద్వారా 35,000 మందికి ఉపాధి కల్పించనున్నారు.

Details

 అమరావతి జలహారతి కార్పొరేషన్‌కు ఆమోదం 

రెండో దశ కేప్టివ్ పోర్టు రూ.5,382 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇది 5,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ పోర్టును నిప్పాన్ సంస్థ స్వయంగా నిర్మించనుంది. అనుమతులన్నీ సకాలంలో వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 'అమరావతి జలహారతి కార్పొరేషన్‌' అనే ప్రత్యేక వాహన సంస్థ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇది నాలుగేళ్లలో తగిన పురోగతిని సాధించనుంది. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు కలిసి దీనిని కార్యరూపం దిద్దుతారు.

Details

చింతలపూడి ప్రాజెక్టు.. అదనపు వ్యయానికి దర్యాప్తు 

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వేంపాడు మేజర్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 2022లో స్టాండింగ్ కమిటీ రూ.44.60 కోట్ల అదనపు ఖర్చులకు ఆమోదం తెలిపిన విషయం గుర్తు చేశారు. అయితే ముందస్తు అనుమతులు లేకుండా ఖర్చు చేసినందున దానిపై జలవనరుల శాఖ మంత్రివర్గానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ ఖర్చు ఎలా జరిగింది? ఎందుకు ముందస్తు అనుమతులు తీసుకోలేదన్న విషయాలపై దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసింది.

Details

బార్ లైసెన్సు ఫీజులో భారీ తగ్గింపు 

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు మంత్రివర్గం మూడు నక్షత్రాల హోటళ్లలో బార్ లైసెన్సు ఫీజును రూ.65 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించింది. ప్రస్తుతం అనుమతులు లేకుండానే బార్‌లు నడుస్తుండటంతో ఈ తగ్గింపు వల్ల పెద్దగా ఆర్థిక నష్టం ఏమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఐదేళ్లలో 50,000 అదనపు గదులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఇతర కీలక నిర్ణయాలు ఉగాది పురస్కారాలను మంత్రివర్గం ర్యాటిఫై చేసింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.710 కోట్ల హడ్కో రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.

Details

 సీనియర్ ఐఏఎస్‌లకు పల్లె పయనం

రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్‌లు ప్రతి ఒక్కరూ పల్లెల్లో రెండు రాత్రులు, మూడు పగళ్లు గడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీళ్లు, రవాణా, గ్యాస్, రహదారులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. దీని ద్వారా గ్రామాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. నవయుగ, ఏపీ జెన్‌కోకు నష్టపరిహారం పోలవరం జలవిద్యుత్ కేంద్ర కాంట్రాక్టు విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఏపీ జెన్‌కో సంస్థలకు నష్టం వాటిల్లిందని గుర్తించి మంత్రివర్గం పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 8, 2024న జారీ అయిన ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేస్తారు. దీనివల్ల నవయుగ కంపెనీకి రూ.742 కోట్లు, ఏపీ జెన్‌కోకు రూ.986.17 కోట్ల నష్టం భర్తీ చేయనుంది.