
Delhi CM: సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడిచేందుకు ప్లాన్.. విచారణలో సంచనల విషయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్ (41)ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడవాలని ముందే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు. అయితే కార్యాలయం, నివాసం వద్ద గట్టి భద్రత ఉండడంతో తన ప్రణాళికను విరమించుకున్నట్లు తెలిపాడు. దిల్లీలో వీధి కుక్కలను తరలించాలని అనేకసార్లు కోరినా సీఎం స్పందించలేదు. అందుకే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాను. తొలుత సుప్రీంకోర్టుకు వెళ్లాను. అక్కడి భద్రతను గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయాను. తరువాత సివిల్ లైన్స్‌లోని సీఎం కార్యాలయానికి చేరుకున్నాను.
Details
సీఎం రేఖా గుప్తా తల, భుజం, చేతులకు గాయాలు
కత్తితో పొడవాలని ప్లాన్ చేశాను. కానీ అక్కడ కూడా భద్రత ఎక్కువగా ఉండడంతో కత్తిని బయటే పారేశానని సకారియా పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ ఘటన ఆగస్టు 20న సివిల్ లైన్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో 'జన్ సున్వాయ్' కార్యక్రమం జరుగుతున్న సమయంలో చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుడి వేషంలో వచ్చిన దుండగుడు పత్రాలు అందిస్తున్నట్లు నటించి ఒక్కసారిగా సీఎంపై దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టి, వెనక్కి తోసేయడానికి ప్రయత్నించాడు. అంతేకాదు జుట్టును బిగిగా పట్టుకున్నాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో సీఎం రేఖా గుప్తా తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి.
Details
మరో నిందితుడి అరెస్ట్
ఈ ఘటనలో మరో నిందితుడు తహసీన్ సయ్యద్‌ను కూడా దిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతడు ప్రధాన నిందితుడు సకారియాకు సన్నిహితుడని గుర్తించారు. సయ్యద్ దాడి ప్రణాళికలో సకారియాకు సహకరించడమే కాకుండా కొంత మొత్తంలో డబ్బు కూడా పంపినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, దాడికి ముందే సీఎం నివాసం సంబంధించిన వీడియోలను సకారియా తన స్నేహితుడు సయ్యద్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా మార్పులు దాడి ఘటన తర్వాత సీఎం రేఖా గుప్తాకు సీఆర్పీఎఫ్ జవాన్లతో కూడిన జడ్ కేటగిరీ భద్రత కేటాయించారు. తాజాగా ఆ భద్రతను తొలగించి, మునుపటిలాగే దిల్లీ పోలీసులు ఆమెకు భద్రత కల్పించనున్నట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి.