Pm Kisan: పీఎం కిసాన్ 22వ విడతకు సిద్ధం.. ఎవరికీ వస్తాయి? ఎవరికీ రావు?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది. సాగు సమయంలో రైతులకు వచ్చే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది కేంద్రం. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 9 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు ప్రతి విడతలో రూ.2,000 చొప్పున 21 విడతలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు 22వ విడత నిధుల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వివరాలు
ఏడాదికి రూ.6,000 సాయం ఎలా ఇస్తారు?
మార్చి 13 (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోం రాష్ట్రంలోని గువాహటి నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.18,640 కోట్లు జమ కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్రం సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. విడతలను మూడు కాలాలుగా విభజించారు: ఏప్రిల్ - జూలై ఆగస్టు - నవంబర్ డిసెంబర్ - మార్చి
వివరాలు
లబ్ధిదారుల సంఖ్య తగ్గింది
ప్రస్తుతం విడుదల కానున్న 22వ విడత డిసెంబర్-మార్చి కాలానికి సంబంధించినది. సాధారణంగా ఈ విడత డబ్బులు ఫిబ్రవరిలోనే జమ అవుతాయి. అయితే ఈసారి అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగడంతో విడుదల కొంత ఆలస్యమైంది. ఈసారి లబ్ధిదారుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత 21వ విడతలో 9.35 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందగా,ప్రస్తుతం ఈ సంఖ్య 9.32 కోట్లకు తగ్గింది. ఇ-కేవైసీ పూర్తి చేయని వారు లేదా అర్హత లేకపోయినా పథకం ప్రయోజనం పొందుతున్నవారిని జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. గత కొన్నేళ్లలో కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. 2022-23లో ఏప్రిల్-జూలై సమయంలో 10.48 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ఉన్నారు.
వివరాలు
ఇ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?
అప్పటి నుంచి మొత్తం సంఖ్య 1.10కోట్లకు పైగా తగ్గింది. పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేయాలి. ఇది చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి: 1. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత OTP వెరిఫికేషన్ ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేయవచ్చు. 2. కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేయించుకోవచ్చు. 3. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. అలాగే పీఎంకిసాన్ పోర్టల్‌లోని "Farmers Corner" విభాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి తమ స్టేటస్ తెలుసుకోవచ్చు. జిల్లా,మండలం,బ్లాక్,గ్రామం వివరాలు నమోదు చేసి బెనిఫిషియరీ జాబితాలో తమ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు.
వివరాలు
వీరికి మాత్రం పథకం వర్తించదు
పీఎం కిసాన్ పథకం నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు ఈ సాయం అందదు. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసినవారు లేదా కొత్తగా భూయాజమాన్య హక్కులు పొందినవారు ఒకే కుటుంబంలో తండ్రీ-కొడుకు లేదా భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లయితే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తులు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ.10,000కుపైగా పెన్షన్ పొందేవారు ప్రజాప్రతినిధులు ఈ వర్గాలకు చెందినవారికి పథకం ప్రయోజనాలు అందవు. కొన్ని సందర్భాల్లో అనుమానం ఉంటే లబ్ధిని తాత్కాలికంగా నిలిపివేసి, వెరిఫికేషన్ అనంతరం కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది.