PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు
జనవరి 22వ తేదీన జరిగే చారిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జనవరి 22న అయోధ్య శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్యకు కనక్టివిటీని పెంచేందుకు శనివారం మోదీ అయోధ్యలో రైల్వే స్టేషన్, ఆరు వందే భారత్, రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సహా మొత్తం రూ.15,700 కోట్లతో 46 అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. డిసెంబర్ 30వ తేదీ దేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు. 1943లో ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్‌లో జెండాను ఎగురవేసి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించారన్నారు.
జనవరి 22న ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించండి: ప్రధాని మోదీ
దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయోధ్యకు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 22న అయోధ్యకు రావద్దని ప్రజలను ప్రధాని మోదీ కోరారు. కేవలం కొందరికే ఆహ్వానం అందిందని, వారు మాత్రమే వస్తారని పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో హాజరై ఇబ్బంది పెట్టొద్దన్నారు. జనవరి 22న తర్వాత ఇక్కడి వచ్చేందుకు ప్లాన్ చేసుకోవాలని మోదీ కోరారు. జనవరి 14-21 వరకు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. అందులో భాగంగానే అయోధ్యలో కూడా చేపట్టాలన్నారు. జనవరి 22న దేశ ప్రజలందరూ తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించి దీపావళి జరుపుకోవాలని 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
యూపీ అభివృద్ధికి అయోధ్య దోహదం: మోదీ
ఒకప్పుడు అయోధ్యలో శ్రీరాముడు డేరాలో ఉండేవారని, ఇప్పుడు రాముడికి శాశ్వత ఇల్లును నిర్మించినట్లు మోదీ పేర్కొన్నారు. అలాగే దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలకు కూడా శాశ్వత ఇల్లు లభించినట్లు వివరించారు. రాబోయే కాలంలో అయోధ్య అనేది.. అవధ్ ప్రాంతమే కాకుండా మొత్తం యూపీ అభివృద్ధికి దిశానిర్దేశం చేయబోతోందని ప్రధాని ఆకాంక్షించారు. భారతదేశం మరో పెద్ద ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వందే భారత్, నమో భారత్ తర్వాత దేశానికి మరో ఆధునిక రైలు వచ్చిందన్నారు. కొత్త రైలుకు అమృత్ భారత్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ త్రిమూర్తులుగా చెప్పుకునే ఈ రైళ్లు భారతీయ రైల్వేకు పునర్వైభవం తీసుకురాబోతున్నాయని మోదీ అన్నారు.