
PM Modi: సముద్రతీరంలో సైనికులతో మోదీ దీపావళి.. విక్రాంత్ శౌర్యాన్ని ప్రశంసించిన ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులతో కలిసి జరుపుకుంటారని తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని కొనసాగిస్తూ, ఆయన ఈసారి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి ఉత్సవాలు నిర్వహించారు. ఆదివారం రాత్రి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు చేరుకున్న మోదీ, సోమవారం ఉదయం నేవీ సిబ్బందితో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఐఎన్‌ఎస్ విక్రాంత్ అనే పేరు విన్నప్పుడే పాకిస్థాన్ నిద్ర కోల్పోతుంది. ఈ నౌక వారికి ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చింది" అని పేర్కొన్నారు.
వివరాలు
ఐఎన్‌ఎస్ విక్రాంత్ సేవలను ప్రశంసించిన మోదీ
"నౌకాదళ యోధులతో కలిసి దీపావళిని జరుపుకోవడం నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నా.ఈ సుందర దృశ్యం ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతుంది. ఒకవైపు విస్తారమైన సముద్రం,మరోవైపు భారతమాతకు రక్షకులైన వీర జవాన్లు.. ఈ క్షణం నాకు ఎంతో గర్వంగా ఉంది. సముద్రంపై పరుచుకున్న సూర్యకాంతులు,మన సైనికులు వెలిగించిన దీపాల కాంతిలా మెరుస్తున్నాయి,"అని మోదీ భావోద్వేగంగా అన్నారు. తరువాత ఆయన ఐఎన్‌ఎస్ విక్రాంత్ సేవలను ప్రశంసించారు. "ఈ విమాన వాహక నౌక భారత రక్షణ దళాల శక్తి, సామర్థ్యానికి చిహ్నం. ఆపరేషన్ సిందూర్ సమయంలో విక్రాంత్ పాకిస్థాన్‌ను మోకాళ్లపైకి తెచ్చింది. శత్రువుల ధైర్యాన్ని చిదిమేసి, వారిలో భయాన్ని నింపింది. ఈ నౌక పేరు వినగానే పాకిస్థాన్‌లో కుదురుగా నిద్రించే వారు లేరు," అని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
త్రివిధ దళాల పరాక్రమానికి సెల్యూట్
మోదీ ఈ సందర్భంలో త్రివిధ దళాల పరాక్రమానికి సెల్యూట్ చేశారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. "మాతృభూమి కోసం తమ ప్రాణాల్ని అర్పించడానికి ప్రతి సైనికుడు సిద్ధంగా ఉన్నాడు. ఇదే భారత సైనికుడి అసలైన తత్వం," అని ప్రధానమంత్రి గర్వంగా పేర్కొన్నారు.