PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం..ఇంధన నిల్వలు, ఎరువుల సరఫరాపై సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భద్రతా, కీలక విధానాల కేబినెట్ సమావేశం (సీసీఎస్) జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోదీతో పాటు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. ముఖ్యంగా, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, దేశీయ ఇంధన సరఫరాలు, ఎరువుల అందుబాటు, భారతీయుల భద్రత వంటి కీలక అంశాలను చర్చించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో యుద్ధం ప్రారంమై, పశ్చిమ ఆసియా పరిసర ప్రాంతంలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.
వివరాలు
ఖర్చులు పెరగకుండా చర్యలు
పశ్చిమ ఆశియా యుద్ధ నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం మూడవ సీసీఎస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గత సమావేశాల్లో తీసుకున్న చర్యలు, అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరాల సమీక్షను నిర్వహించారు. ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం, దేశంలో ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నట్లు, మొత్తం సామర్థ్యం 74 రోజులు ఉన్నట్లు తెలిపింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏ విధమైన పెరుగుదల రాకుండా, ఎల్‌పీజీ ధరలు కూడా స్థిరంగా ఉంచబడ్డాయన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు తగినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్‌ల కొరతలు లేవని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు పెరిగినా, దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది.
వివరాలు
గల్ఫ్ నుంచి 5.98 లక్షల మంది రాక
గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు భద్రతతో తిరిగి వచ్చారని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల విద్యా సంవత్సరంలో అంతరాయం రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా యుద్ధ ప్రభావం దేశీయ స్థాయిలో నేరుగా కనిపించకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంధన నిల్వలు, ఎరువుల లభ్యత, విద్యార్థుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించడం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించడానికి కేంద్రం కృషి చేస్తోంది.