PM Modi: రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రధాని మోదీ అభినందనలు..
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభకు తొలిసారి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్‌కు అన్ని పార్టీల సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. పెద్దల సభ గౌరవాన్ని ప్రతి సభ్యుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ ప్రజాసేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని ప్రశంసించారు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగితేనే పార్లమెంట్‌కు నిజమైన సార్థకత ఉంటుందని పేర్కొన్నారు.
వివరాలు
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్
గత వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున అప్పటి ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. ఆయన స్థానంలో మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది. తాజాగా శీతాకాల సమావేశాల మొదటి రోజున రాజ్యసభ ఛైర్మన్‌గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించగా, సభ సభ్యులు అందరూ ఆయనను అభినందించారు.
వివరాలు
ఓటమి నిరాశను వ్యక్తం చేయడానికి పార్లమెంట్ యుద్ధభూమి కాదు
ఇదిలా ఉండగా, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ''ఓటమి నిరాశను వ్యక్తం చేయడానికి పార్లమెంట్ యుద్ధభూమి కాదు'' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. మనమంతా సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి ప్రాధాన్యం ఉండాలని, శాసనసభల్లో సమయానుకూలంగా చర్చలు జరగడం అత్యవసరమని చెప్పారు. దేశ ప్రగతి కోసం పార్లమెంట్‌లో సార్థకమైన చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా ప్రభుత్వంతో కలిసి ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు.