PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల కారణంగా తన నెలవారీ రేడియో షో 'మన్ కీ బాత్'కు వచ్చే మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆదివారం 'మన్ కీ బాత్' 110వ ఎడిషన్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. గతసారి మాదిరిగానే మార్చి నెలలో లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా అమలు చేసే అవకాశం ఉందని మోదీ అన్నారు. అందుకే మూడు నెలల పాటు ఈ కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజల కోసం సిద్ధం చేసిన కార్యక్రమం అన్నారు.
దేశం కోసం ఓటు వేయాలి: మోదీ
వచ్చే ఎన్నికల్లో దేశం కోసం ఓటు వేయాలని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల తర్వాత మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రత్యేక దినం దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళా శక్తి సహకారానికి సెల్యూట్ చేయడానికి ఒక అవకాశమన్నారు. మహిళలకు సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని 'మహాకవి భారతియార్' వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అక్టోబర్ 3, 2014న ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' తొలి ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు.