Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ.. ప్రత్యేకత ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ప్రస్తుతం కొనసాగుతోంది. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్ట్‌కు స్వయంగా వెళ్లి పుతిన్‌ను ఆత్మీయంగా స్వాగతించారు. ఇద్దరూ కలుసుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న అనంతరం, ఒకే వాహనంలో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఒక బహుమతిని అందజేశారు. రష్యన్ భాషలో ముద్రించబడిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ గీత ప్రతిని పుతిన్ ఎంతో ఆసక్తితో పరిశీలించారు. ప్రస్తుతం భగవద్గీతలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా విక్రయమవుతున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా శుక్రవారం 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి.
వివరాలు
హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశం
ఈ సమావేశాల్లో రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలకు పుతిన్ సంతకాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. శిఖరాగ్ర సమావేశాలు ముగిసిన అనంతరం రష్యా ప్రభుత్వ ఛానల్‌ను భారత్‌లో పుతిన్ ప్రారంభించనున్నారు. ఆపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఆతిథ్య విందులో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు ఆయన తిరిగి రష్యాకు బయల్దేరనున్నారు. ఇదే సమయంలో గురువారం ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఆండ్రీ బెలోసోవ్ భేటీ అయి పలు వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరిపారు.
వివరాలు
కుదరనున్న ఒప్పందాలు ఇవే:
ముఖ్యంగా ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల అంశంపై కీలకంగా మాట్లాడారు. అలాగే సుఖోయ్-57 యుద్ధ విమానాలను భారతదేశానికి విక్రయించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ రోజు జరిగే ద్వైపాక్షిక చర్చల్లో 2 బిలియన్ డాలర్ల విలువైన జలాంతర్గాముల లీజు ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే ముడి చమురు దిగుమతులపై కూడా ఒప్పంద చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యాలో భారత కార్మికులకు ఉద్యోగావకాశాలు కల్పించే అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్ నుంచి రష్యాకు ఫార్మాస్యూటికల్,వ్యవసాయ ఉత్పత్తులు,ఆహార పదార్థాలు, వినియోగ వస్తువుల ఎగుమతులను పెంపొందించే దిశగా కూడా అవగాహన ఒప్పందాలు జరిగే అవకాశముంది.