PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఉద్యోగాల నుంచి మొదలుకొని అన్ని రకాల రిజర్వేషన్లకు దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఈ కాంగ్రెస్ దేశంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ఉండేది కాదన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకమని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖను ఈ సందర్భంగా మోదీ రాజ్యసభలో ప్రస్తావించారు.
ప్రజలకు రిజర్వేషన్‌ను దూరం చేసిన కాంగ్రెస్
గత ఏడు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ ప్రజలకు ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను కాంగ్రెస్ దూరం చేసిందని మోదీ మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో దశాబ్దాలుగా అనేక మంది నివసించినా.. కాంగ్రెస్ వారికి నివాస హక్కు కల్పించలేదన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ను నిన్ననే సభ ఆమోదించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదన్నారు. బాబా సాహెబ్ లేకపోతే ఈ కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చేది కాదని స్పష్టం చేశారు. బాబా సాహెబ్‌కు భారతరత్న ఇవ్వడానికి వారు నిరాకరించారన్నారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు బాబా సాహెబ్‌కు భారతరత్న ప్రకటించామన్నారు. అంతేకాదు అత్యంత వెనుకబడిన కులానికి చెందిన సీతారాం కేసరిని కాంగ్రెస్ రోడ్డున పడేసిందన్నారు.