
PM Modi: ఈసారి గోవా తీరంలో మోదీ దీపావళి వేడుకలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది దీపావళి పండుగను సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లతో కలిసి జరుపుకుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు. ఈసారి గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో ప్రధానమంత్రి దీపావళి వేడుకలు జరుపుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాన్ని ఈవేడుకలలో నౌకాదళతో కలిసి సెలబ్రేట్ చేయనున్నట్లు సమాచారం. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రతి ఏడాది సరిహద్దులలో సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి.. దళాలతో ముచ్చటించి..వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో దీపావళి పండుగను జరుపుకున్నారు.
వివరాలు
2018లో ఉత్తరాఖండ్‌లో..
తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. 2018లో ఉత్తరాఖండ్‌లోని ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ బృందంతో, 2022లో కార్గిల్‌లో, 2023లో చైనా సరిహద్దులోని లేప్చా (హిమాచల్‌ప్రదేశ్) సైనిక శిబిరంలో వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.